-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు SIR-2026లో భాగంగా ఆగస్టు 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ప్రజలు తమ ఓటుకు సంబంధించిన సవరణలు, మార్పులు మరియు నూతన ఓటర్ల నమోదుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ SIR-2026లో భాగంగా ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించామని తెలిపారు. ముసాయిదా జాబితాలో తమ పేరు, ఇంటి పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, ప్రజలు ఈ ప్రత్యేక ప్రచార దినాలను వినియోగించుకొని వాటిని సవరించుకోవచ్చని చెప్పారు. భారత ఎన్నికల సంఘం సూచించిన 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని సంబంధిత ఆధారంగా సమర్పించి, ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సరిచేసుకునే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఇంటి పేరులో తప్పు ఉన్న కారణంగా జారీ చేసిన నోటీసుకు సంబంధించి హియరింగ్‌కు హాజరైన ఒక ఓటరు విచారణ ప్రక్రియను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సదరు ఓటరు తన కుమారుడికి 19 సంవత్సరాల వయస్సు వచ్చినందున నూతన ఓటరుగా నమోదు చేయాలని కమిషనర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్, ఈ ప్రత్యేక ప్రచార దినాలు కేవలం ఓటర్ల జాబితాలో సవరణలకు మాత్రమే కాకుండా, అర్హత కలిగిన నూతన ఓటర్లు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన అర్హత కలిగిన యువత నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇందుకోసం ఎన్నికల సంఘం సూచించిన సరైన గుర్తింపు, ధ్రువీకరణ పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. అదేవిధంగా ఏఆర్ఓలు ప్రత్యేక ప్రచార దినాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, సంబంధిత ఓటరు నమోదు చేసిన చిరునామాలో వాస్తవంగా నివసిస్తున్నారా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు. సంబంధిత చిరునామాలో ఓటరు లేకపోయి, వారు ఇతర ప్రాంతానికి షిఫ్ట్ అయినట్లు గుర్తించిన సందర్భంలో వారి ఓటును వెంటనే తొలగించడం లేదా బదిలీ చేయడం చేయకూడదని సూచించారు. ముందుగా సంబంధిత ఓటరును ఫోన్ ద్వారా సంప్రదించి, వారు ప్రస్తుత చిరునామాలోనే తమ ఓటును కొనసాగించాలనుకుంటున్నారా లేదా తాము షిఫ్ట్ అయిన కొత్త ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకోవాలనుకుంటున్నారా అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని తెలిపారు.
ఓటరు స్వచ్ఛందంగా తమ ఓటును కొత్త చిరునామాకు బదిలీ చేసుకుంటామని అంగీకరించిన సందర్భంలో మాత్రమే తదుపరి ప్రక్రియ చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఓటరు సమ్మతి లేకుండా వారి ఓటును బదిలీ చేయడం లేదా తొలగించడం చేయరాదని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, ఓటర్ల నుంచి వచ్చే సవరణలు, అభ్యంతరాలు, నూతన ఓటర్ల దరఖాస్తులను స్వీకరించి, ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితాలోని వివరాలు ఖచ్చితంగా ఉండేలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా అధికారులు వ్యవహరించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో ఏఈఆర్ఓ మరియు అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, బిఎల్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News