-భక్తుల అనుభూతిని పెంచేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్
-రూ.104 కోట్లతో ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియం ప్రారంభం
-భక్తుల సౌకర్యార్ధం 32 ఈవీ బస్సులు అందించిన రిలయన్స్, భారత్ బయోటెక్
-తిరుమల వచ్చే భక్తులకు ఎల్ఐసీ ఆధ్వర్యంలో రూ.2 లక్షల బీమా
-రాష్ట్రంలో 5 వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం లక్ష్యం: సీఎం చంద్రబాబు
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా, ఆధ్యాత్మికతకు ప్రపంచ స్థాయి నమూనాగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో భక్తులకు మెరుగైన అనుభూతిని అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మికత, సేవాభావం, ఆధునిక సాంకేతికతను సమన్వయం చేస్తామని చెప్పారు. తిరుమల కొండల్లో 89.5 శాతం గ్రీన్ కవర్ ఉందని, దీన్ని మరింత పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియం, రిలయన్స్ ఫౌండేషన్, భారత్ బయోటెక్ సంస్థలు అందించిన 32 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు, తిరుమలలోని వివిధ ప్రాంతాలను త్రీడీ సాంకేతికత ద్వారా భక్తులు వీక్షించే అవకాశం కల్పించారు. 6 డీవీఆర్ వర్చువల్ రియాలిటీ ద్వారా తిరుమల దర్శన అనుభూతిని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. గతంలో ఉన్న ఎస్వీ మ్యూజియాన్ని ఆధునీకరించి పునః ప్రారంభించారు. శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, శ్రీవారి పరిణయం తదితర అంశాలను భక్తులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రదర్శించేలా టీటీడీ ఈ మ్యూజియాన్ని సిద్ధం చేసింది. టీసీఎస్ ట్రస్ట్ రూ.104 కోట్లతో మ్యూజియాన్ని అభివృద్ధి చేసింది. శ్రీకృష్ణదేవరాయలు సహా వివిధ రాజులు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల నమూనాలు, వివిధ కాలాలకు చెందిన చారిత్రక వస్తువులు, స్వామివారికి అలంకరించే కిరీటాలు, ఆభరణాల త్రీడీ నమూనాలను మ్యూజియంలో ఏర్పాటు చేశారు. పానోరమిక్ స్క్రీన్‌పై ఏఐ వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాలను ముఖ్యమంత్రి తిలకించారు. శ్రీవారి సేవకోసం, స్వామి వారిని కీర్తించేందుకు ఆనాటి సంగీత కారులు వినియోగించిన వాయిద్య పరికరాలను కూడా మ్యూజియంలో సీఎం ఆసక్తిగా పరిశీలించారు.
తిరుమలలో భక్తుల కోసం 32 ఎలక్ట్రిక్ బస్సులు
తిరుమలలో భక్తుల రాకపోకలకు వీలుగా రిలయన్స్ ఫౌండేషన్, భారత్ బయోటెక్ సంస్థలు అందించిన 32 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. రిలయన్స్ ఈ-మోబిలిటీ సీఈఓ నితిన్ సేత్, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా టీటీడీ సభ్యులతో కలిసి నారాయణ గిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకూ ఎలక్ట్రిక్ బస్సులో సీఎం ప్రయాణించారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికీ బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఎల్‌ఐసీతో కలిసి ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ బీమా అమలు చేయనున్నట్లు చెప్పారు. దురదృష్టవశాత్తూ తిరుమలలో భక్తుడు మరణిస్తే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందేలా ఈ బీమా వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 5 వేల దేవాలయాలను శ్రీవాణి ట్రస్టు ద్వారా నిర్మాణం చేపడతామన్నారు. మారిషస్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించాలని కోరుతున్నారని, దీనిపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు. శ్రీవారి సేవకులను విద్య, వైద్య రంగాల్లోనూ వినియోగించుకునేలా కార్యాచరణ చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరు అంశాల్లో తిరుమల తిరుపతి దేవస్థాన కార్యకలాపాలను పునర్వవస్థీకరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News