Breaking News

డిజిటల్ వ్యవసాయంలో దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్

– 52.08 లక్షల మంది రైతులకు ఫార్మర్ ఐడిలు.. 86.8 శాతం అగ్రీస్టాక్ లక్ష్యం పూర్తి
– APAIMS 2.0తో ఎరువుల అక్రమ వినియోగానికి అడ్డుకట్ట.. 22 శాతం ఆదా
– ఎల్‌నినోలోనూ పప్పుధాన్యాల సాగులో 99 శాతం లక్ష్యసాధన
– 80 శాతం రాయితీపై కంటింజెన్సీ విత్తనాలకు రూ.200 కోట్లు
– పంటల బీమాకు 44 లక్షల దరఖాస్తులు.. రూ.16 వేల కోట్ల బీమా రక్షణ
– రైతు సంక్షేమంలో కేంద్రం సహకారం అభినందనీయం
– సౌత్ స్టేట్స్ వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సాంకేతికతను రైతుకు చేరువ చేస్తూ, సాగు వ్యయాన్ని తగ్గించి, రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్‌నినో కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ రైతులకు అండగా నిలుస్తూ డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల స్వయం సమృద్ధి, ఎరువుల పారదర్శక పంపిణీ, పంటల బీమా, మార్కెటింగ్ రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నామన్నారు. హైదారాబాద్ లో సౌత్ స్టేట్స్ వ్యవసాయ మంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాంకేతిక సంస్కరణలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సహకారానికి, ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

52.08 లక్షల మంది రైతులకు ఫార్మర్ ఐడిలు

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో భాగంగా అగ్రీస్టాక్ అమల్లో ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 60 లక్షల PM-KISAN లబ్ధిదారుల్లో 52.08 లక్షల మందికి Farmer IDలు సృష్టించి 86.8 శాతం ప్రగతి సాధించామన్నారు. ఖరీఫ్–2026లో డిజిటల్ పంటల సర్వే ద్వారా సుమారు 68 లక్షల మంది రైతులకు చెందిన 97 లక్షల ఎకరాల పంట విస్తీర్ణాన్ని నమోదు చేశామని తెలిపారు. ఈ డేటాను పంట విస్తీర్ణం, దిగుబడి అంచనాలకు వినియోగిస్తున్నామని, అగ్రీస్టాక్‌ను ఎరువుల పంపిణీ, MSP కొనుగోళ్లు, ఉత్పత్తి అంచనాలు, PMFBYతో అనుసంధానం చేస్తున్నామని వివరించారు.

APAIMS 2.0తో 22 శాతం ఎరువుల ఆదా

ఎరువుల పంపిణీలో APAIMS 2.0 ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతు వివరాలు, కమతం, విస్తీర్ణం, సాగుచేసిన పంట ఆధారంగా శాస్త్రీయ సిఫార్సుల మేరకు యూరియా, DAP పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు సుమారు 24.69 లక్షల మంది రైతులు డిజిటల్ విధానంలో ఎరువులు కొనుగోలు చేశారని తెలిపారు. యూరియా విక్రయాలు 31 శాతం, DAP విక్రయాలు 32 శాతం తగ్గాయని, యూరియా వినియోగం 6.67 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి సుమారు 4.60 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిందన్నారు. ఎల్‌నినో కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడంతో ఎరువుల వినియోగం 9 శాతం తగ్గగా, APAIMS 2.0 ద్వారా అక్రమ వినియోగాన్ని అరికట్టి మరో 22 శాతం ఎరువులను ఆదా చేయగలిగామని మంత్రి వివరించారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్‌గా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్ ఎరువుల యాప్‌ను రబీ 2026–27లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు.

అగ్రీస్టాక్‌కు కేంద్రం మరింత సహకరించాలి

సమగ్ర డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగించాలని మంత్రి కోరారు. భూ రికార్డుల అనుసంధానంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, జియో-రిఫరెన్స్ చేసిన గ్రామ పటాల ధ్రువీకరణను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అగ్రీస్టాక్ ఆధారిత కొనుగోళ్లు, పంటల బీమా తదితర సేవల కోసం వివిధ శాఖల మధ్య డేటా అనుసంధానాన్ని మరింత సులభతరం చేయాలని కోరారు.

ఎల్‌నినోలోనూ పప్పుధాన్యాల్లో 99 శాతం లక్ష్యం

ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ పప్పుధాన్యాల సాగులో రాష్ట్రం దాదాపు 99 శాతం లక్ష్యాన్ని సాధించిందని అచ్చెన్నాయుడు తెలిపారు. సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 3.4 లక్షల హెక్టార్లు కాగా కంది, మినుము, పెసర పంటల్లో కొన్ని లక్ష్యాలను మించి సాగు నమోదైందన్నారు. పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ కింద కంది, మినుముల 100 శాతం కొనుగోలుకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. స్వల్పకాలిక, కరువును తట్టుకునే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పశుగ్రాస పంటలను ప్రోత్సహిస్తున్నామని, అవసరమైన పంటలకు ప్రభుత్వపరంగా బైబ్యాక్ భరోసా కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

రైతుకు గిట్టుబాటు.. వినియోగదారుడికి అందుబాటు

వ్యవసాయం, ఉద్యానవనం, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్లను క్రియాశీలం చేశామని మంత్రి తెలిపారు. సాధారణ రైతు బజార్లతో పాటు మొబైల్, డిజిటల్ రైతు బజార్లను అనుసంధానం చేస్తున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఎల్‌నినో ఉపశమనానికి రూ.200 కోట్లు

ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కంటింజెన్సీ విత్తనాలను 80 శాతం రాయితీపై అందించేందుకు రూ.200 కోట్లు కేటాయించామని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రీ-మాన్‌సూన్ డ్రై సోయింగ్ కింద 32 రకాల విత్తనాలను ప్రోత్సహిస్తున్నామని, తద్వారా భూమిపై పచ్చదనం పెంచడంతోపాటు పశుగ్రాస కొరతను తగ్గించవచ్చన్నారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నీటి కొరత ప్రాంతాల్లో అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆగస్టు 7 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా వ్యవసాయ, సాగునీటి, రెవెన్యూ, అనుబంధ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఎల్‌నినో ఉపశమన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. “ప్రతి రైతు.. ప్రతి పొలం.. ప్రతి పంటను పరిశీలించి రైతుకు అవసరమైన సాంకేతిక సలహాలు అందిస్తున్నాం. ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలను కాపాడటమే మా మొదటి ప్రాధాన్యం” అని మంత్రి స్పష్టం చేశారు.

44 లక్షల బీమా దరఖాస్తులు.. రూ.16 వేల కోట్ల రక్షణ

పంటల బీమా నమోదును ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టడంతో రైతుల నుంచి భారీ స్పందన లభించిందని అచ్చెన్నాయుడు తెలిపారు. మొత్తం 44 లక్షల దరఖాస్తులు అందగా, వీరిలో 18.83 లక్షల మంది రుణ రైతులు, సుమారు 26 లక్షల మంది రుణేతర రైతులు ఉన్నారని చెప్పారు. గత ఏడాది సుమారు 2 లక్షలుగా ఉన్న రుణేతర రైతుల నమోదు ఈ ఏడాది 26 లక్షలకు పెరగడం విశేషమన్నారు. సుమారు 17 లక్షల హెక్టార్లకు దాదాపు రూ.16 వేల కోట్ల బీమా రక్షణ కల్పించామని, మొత్తం ప్రీమియం సుమారు రూ.630 కోట్లు కాగా రైతుల వాటా దాదాపు రూ.270 కోట్లుగా ఉందని వివరించారు.

బీమా క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించాలి

వర్షాధార వ్యవసాయ కుటుంబాలకు పంటల బీమా అత్యంత కీలకమైన ఆర్థిక భరోసా అని మంత్రి పేర్కొన్నారు. రైతుల బీమా క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. PMFBY, RWBCIS కింద కేంద్ర ప్రభుత్వ వాటాను సకాలంలో విడుదల చేయడంతోపాటు పెండింగ్ బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సాంకేతికతను రైతుకు చేరువ చేసి, సాగు వ్యయాన్ని తగ్గించి, ఉత్పాదకతను పెంచి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రకృతి ఎంత సవాల్ విసిరినా రైతును ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే ప్రతి సవాల్‌ను అధిగమించి రైతును మరింత బలోపేతం చేస్తాం అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *