-రాష్ట్రంలో హార్డ్‌వేర్ తయారీ హబ్ ఏర్పాటుపై దృష్టి
-రూ.22,177.84 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం
-28 ప్రాజెక్టులతో 19,739 మందికి ఉద్యోగాల కల్పన
-జిల్లాల ఎగుమతుల ర్యాంకింగ్‌లో దేశంలోనే 10వ స్థానంలో తిరుపతి
-సీఎం చంద్రబాబు అధ్యక్షతన 21వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను కీలకమైన హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు… తీర ప్రాంతం పొడవునా పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశమైంది. మొత్తం 28 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి రూ.22,177.84 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇంధన రంగం, ఐటీ కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన వివిధ ప్రతిపాదనలపై చర్చించి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఏపీని దేశంలోనే ప్రముఖ హార్డ్‌వేర్ తయారీ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. సెమీ కండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్ హబ్‌లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కేవలం ఎలక్ట్రానిక్స్ తయారీతో ఆగకుండా పరిశోధన, డిజైన్ల రూపకల్పన మాన్యుఫ్యాక్చరింగ్‌తో పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. సోలార్ ప్యానళ్ల తయారీతో పాటు వాటికి అవసరమైన అనుబంధ పరిశ్రమలు, సాంకేతికత, నైపుణ్యాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో పరిశోధన, తయారీ సంస్థలు వేగంగా ఏర్పాటయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. డ్రోన్, స్పేస్ సిటీల సమీపంలో ఆయా రంగాలకు అనుబంధంగా ఉండే క్లస్టర్ పరిశ్రమలు ఏర్పడేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు తైవాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు.
పెట్టుబడులకు ఆమోదం తెలిపిన తర్వాత ప్రాజెక్టులు కేవలం త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు 6 నెలల గడువు విధించి, ఆ వ్యవధిలోగా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద ఉన్న భూమిని వాణిజ్యపరంగా సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. పోర్టుల అభివృద్ధితో పాటు వాటి చుట్టూ లాజిస్టిక్స్, షిప్ బిల్డింగ్, గోదాములు, తయారీ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఫిషింగ్ హార్బర్లను కూడా అభివృద్ధి చేయాలన్నారు. కార్గో షిప్‌ల నిర్మాణంతో పాటు డిఫెన్స్, టూరిజం అవసరాలకు అనుగుణంగా షిప్‌బిల్డింగ్ కార్యకలాపాలను రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.
లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ
పోర్టులు–షిప్‌బిల్డింగ్–లాజిస్టిక్స్–పరిశ్రమలను అనుసంధానించే సమగ్ర ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. లాజిస్టిక్స్ రంగంపై విస్తృతంగా పనిచేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని అన్నారు. పోర్టులు, రైలు, రోడ్డు, ఎయిర్ కార్గో, అంతర్గత జల రవాణా వంటి అన్ని రవాణా మార్గాలను అనుసంధానం చేసి సమగ్ర లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీసిటీ తో తిరుపతి జిల్లా ఎగుమతుల్లో దేశంలోనే 10వ స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా 12 స్థానంలో ఉందని ఎగుమతుల్లో టాప్-5లోకి తీసుకురావాలని సీఎం సూచించారు. రాష్ట్ర యువత నైపుణ్యాల్లో అగ్రస్థానంలో ఉండాలని సీఎం అన్నారు. 10వ తరగతి నుంచే స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించాలని సూచించారు. దీనిపై స్కిల్ మ్యాపింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పీఎం సేతును కూడా అనుసంధానం చేసుకుంటూ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. విశాఖపట్నంలోని అదానీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో నైపుణ్య శిక్షణతో పాటు సివిల్ ఏవియేషన్ సహా ఎంఆర్వో ఫెసిలిటీని కూడా అభివృద్ధి చేస్తున్న విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేందుకు ఇలాంటి అవకాశాలను విస్తరించాలని సూచించారు. మెటీరియల్ రీసెర్చ్‌లో కూడా అత్యంత కీలకంగా నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భవిష్యత్ తయారీ పరిశ్రమలకు అవసరమైన పరిశోధన, సాంకేతిక నైపుణ్యాలు, మానవ వనరులను అభివృద్ధి చేయాలని సూచించారు. సిమెంట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసేందుకు కొన్ని సిమెంట్ కంపెనీలు ముందుకు వచ్చినట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలు, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానాలను పరిశీలించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అగ్రి-బేస్డ్ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కూడా మహిళలు మరింతగా పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు విస్తృతమయ్యేలా ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్’ విధానాన్ని ప్రోత్సహించాలని సీఎం సూచించారు.
రేర్ ఎర్త్ మినరల్స్ పై ప్రత్యేక దృష్టి
రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను హబ్‌గా తయారు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని అన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఆధారిత ప్రాసెసింగ్, విలువ ఆధారిత పరిశ్రమలు, పరిశోధన, తయారీ రంగాలను అనుసంధానం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. టీటీడీ పరిధిలోని భవనాలపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వంటి ప్రత్యామ్నాయాల వైపు మళ్లాలని సూచించారు. టీటీడీలో నెట్‌జీరో లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు చేపట్టాలని, ఎలక్ట్రిక్ బస్సులు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 511 చార్జింగ్ స్టేషన్లకు అనుమతులు ఇచ్చినట్లు సమావేశంలో వెల్లడించారు. ఆన్‌షోర్ విండ్ మిల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం సూచించారు. గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం నిర్దేశించుకున్న 160 గిగావాట్ల లక్ష్యానికి గాను ఇప్పటికే 113,75 గిగావాట్లకు సంబంధించి పెట్టుబడులు సాధించినట్టు అధికారులు వివరించారు. డిసెంబర్ 17, 18 తేదీల్లో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో హైడ్రోజన్ వ్యాలీ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవంబర్‌లో జరిగే భాగస్వామ్య సదస్సు సందర్భంగా పెట్టుబడిదారులకు అందించే ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాల ఏర్పాటుపై చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆతిథ్య రంగంలో హోటళ్లు పెద్దఎత్తున ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం సూచించారు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ సంస్థలు వచ్చేలా ఆహ్వానించాలన్నారు. విశాఖలో భాగస్వామ్య సదస్సుకు మరో 50 రోజులు సమయమే ఉందని… అప్పటికల్లా గతంలో కుదిరిన ఒప్పందాలు గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు. ఇప్పటివరకు జరిగిన 21 ఎస్ఐపీబీ సమావేశాల్లో మొత్తం 387 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.14.05 లక్షల కోట్ల పెట్టుబడులు, 10.79 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణ, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు పరిశ్రమలు, ఐటీ, ఐ అండ్ ఐ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
21వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదం తెలిపిన 28 ప్రాజెక్టుల వివరాలు:
1.క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కడప జిల్లా – రూ.950 కోట్ల పెట్టుబడి – 90 మందికి ఉద్యోగాలు.
2.సాయి బయోఎనర్జీ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ లిమిటెడ్ – నంద్యాల జిల్లా- రూ.168.56 కోట్ల పెట్టుబడి– 600 మందికి ఉద్యోగాలు.
3.ఎం. వెంకటరావు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంవీఆర్ టెర్రావాంట్ జేవీ) – శ్రీ సత్యసాయి జిల్లా – రూ.3,078 కోట్లు – 1,300 ఉద్యోగాలు.
4.రిజాల్వెన్ టూ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ – కర్నూలు – రూ.980 కోట్లు – 250 మందికి ఉద్యోగాలు.
5.ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ – విశాఖపట్నం – రూ.100 కోట్లు – 2,400 మందికి ఉద్యోగాలు.
6.డెలాయిట్ – విశాఖపట్నం – రూ.43.75 కోట్లు – 2,500 ఉద్యోగాలు.
7.ఫోటాన్‌కోర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి – రూ.9 కోట్లు – 45 ఉద్యోగాలు.
8.వెరిడాటా హెల్త్ ఇంక్. – అమరావతి – రూ.4.5 కోట్లు – 50 ఉద్యోగాలు.
9.క్వాన్‌ఫ్లుయెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి – రూ.5 కోట్లు – 30 ఉద్యోగాలు.
10.ట్రైక్వాంటా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి – క్వాంటమ్ హార్డ్‌వేర్ – రూ.35కోట్లు – 175 ఉద్యోగాలు.
11.క్వాంటమ్ కోడాన్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి – క్వాంటమ్ ఏఐ/బయోటెక్నాలజీ – రూ.167 కోట్లు – 126 ఉద్యోగాలు.
12.శ్రిష్టి క్వాంటమ్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి – క్వాంటమ్ హార్డ్‌వేర్ – రూ.100 కోట్లు – 110 ఉద్యోగాలు.
13.ఆరోహక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి -క్వాంటమ్ టెక్నాలజీ – రూ.62 కోట్లు – 300 ఉద్యోగాలు.
14.గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ – మచిలీపట్నం– రూ.8,000 కోట్లు – 3,000 ప్రత్యక్ష, 5,000 పరోక్ష ఉపాధి.
15.మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ – పల్నాడు – రూ.3,000 కోట్లు– 2,000 ఉద్యోగాలు.
16.క్యాటర్‌పిల్లర్ ఇంక్. – శ్రీసిటీ, తిరుపతి – రూ.150 కోట్లు – 80 ఉద్యోగాలు.
17.ఎంఏఎఫ్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ – కుప్పం, చిత్తూరు – రూ.215 కోట్లు – 2,560 ఉద్యోగాలు.
18.దాల్మియా సిమెంట్, కడప – రూ.395.23 కోట్లు.
19.అగర్వాల్ ఫౌండ్రీస్ – నెల్లూరు –రూ.549కోట్లు – 245 ఉద్యోగాలు.
20.శ్రీ వైభవ లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ – నెల్లూరు – రూ.222.63 కోట్లు – 300 ఉద్యోగాలు.
21.శ్రీ వసుధ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ –అనంతపురం – రూ.254.06 కోట్లు – 350 ఉద్యోగాలు.
22.రావోక్స్ అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – చిత్తూరు – రూ.1,388.14 కోట్లు – 1,000 ఉద్యోగాలు.
23.కెల్లాగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – శ్రీ సిటీ, సత్యవేడు – రూ.211.70 కోట్లు – 30 ఉద్యోగాలు.
24.ఎపిటోమ్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ – నెల్లూరు – రూ.530.65 కోట్లు – 238 ఉద్యోగాలు.
25.హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ – విజయనగరం, తిరుపతి – రూ.1,127 కోట్లు – 195 ఉద్యోగాలు.
26.గ్రాండ్ తిరుపతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – తిరుపతి – రూ.188.11 కోట్లు– 851 ఉద్యోగాలు.
27.సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ – అమరావతి– రూ.167 కోట్లు – 600 ఉద్యోగాలు.
28.జేఎల్ అసోసియేట్స్ – కడప – రూ.53.25 కోట్లు – 314 ఉద్యోగాలు.
Prajavartha Online Telugu News