Breaking News

విశాఖ ఆర్‌కే బీచ్‌లో సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

-సముద్ర వ్యర్ధాలను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులతో ముఖాముఖి
-సముద్రగర్భంలోని వ్యర్థాలను సేకరించే విధానంపై స్కూబా డైవర్లతో ముఖ్యమంత్రి ఇంటరాక్షన్
-సముద్రంలోని వ్యర్థాల సేకరణతో అదనపు ఆదాయం వస్తోందని సీఎంకు వివరించిన మత్స్యకారులు
-ఓషన్‌ ప్లాస్టిక్‌ రికవరీ సెంటర్‌ పైలట్‌ సైట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
-సాగర తీరాన మురిమిక్చర్‌ రుచిని ఆస్వాదించిన ముఖ్యమంత్రి
-విశాఖ పర్యటనలో భాగంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో నిర్వహిస్తోన్న సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఆర్కే బీచ్ సందర్శించారు. అక్కడ జరుగుతోన్న సాగర తీర స్వచ్ఛత కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్న మత్స్యకారులు, పారిశుద్ధ్య కార్మికులు, స్కూబా డైవర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బీచ్‌ శుభ్రత, సముద్రంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ, సముద్రగర్భంలోని వ్యర్థాల తొలగింపు తదితర కార్యక్రమాలను పరిశీలించి… వాటిలో భాగస్వాములైన వారి అనుభవాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి బీచ్‌ శుభ్రతలో పాల్గొన్న సీఎం… తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వారు చేపడుతున్న విధానాలను పరిశీలించారు. అనంతరం మత్స్యకారులతో మాట్లాడి.. చేపల వేటతో పాటు సముద్రంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. ప్రత్యేక వలలతో చేపల వేట సమయంలోనే ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి ఓషన్‌ ప్లాస్టిక్‌ రికవరీ సెంటర్‌కు తరలిస్తున్నామని మత్స్యకారులు సీఎంకు వివరించారు. సేకరించిన వ్యర్థాలను డిజిటల్‌ తూకంపై బరువు కొలుస్తున్నామని… దాని ఆధారంగా ప్రోత్సాహకం అందుతోందని.. ఇది తమకు అదనపు ఆదాయమని మత్స్యకారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 1,200 టన్నుల సముద్ర ప్లాస్టిక్‌ను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. సముద్రంలో ప్లాస్టిక్‌ సేకరించి డిజిటల్ తూకం వేసే విధానాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి… వ్యర్ధాల సేకరణ ద్వారా వచ్చే ప్రొత్సాహాన్ని మత్స్యకారులకు అందించారు.

సాగర తీరంలోనూ… సముద్ర గర్భంలోనూ స్వచ్ఛత కార్యక్రమాలు…

మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం అక్కడే ఉన్న స్కూబా డైవర్లతో సీఎం మాట్లాడారు. సముద్ర గర్భంలో రాళ్ల మధ్య, తీరానికి సమీప ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌, పాడైన చేపల వలలు, సీసాలు, ప్యాకేజింగ్‌ వ్యర్థాలను తొలగిస్తున్న విధానాన్ని స్కూబా డైవర్లు సీఎంకు వివరించారు. మత్స్యకారుల పడవలతో కలిసి ఉపరితలంతోపాటు సముద్రగర్భంలోనూ వ్యర్థాలను సేకరిస్తున్నామని తెలిపారు. నీటిలోపల నిర్వహిస్తున్న శుభ్రత కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను సీఎంకు చూపించారు. అనంతరం జీవీఎంసీ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను సీఎం సందర్శించారు. మురుగు కాల్వలు, మ్యాన్‌హోళ్ల శుభ్రతకు వినియోగించే సీవరేజ్‌ రోబోలను పరిశీలించారు. మెషిన్ల సాయంతో పారిశుద్ధ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ పరికరాలను వినియోగిస్తున్నట్లు అధికారులు వివరించారు. విశాఖలో సముద్ర, తీర ప్రాంతాల శుభ్రతకు జీవీఎంసీ చేపడుతున్న ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వీడియో ప్రజెంటేషన్ ను సీఎం తిలకించారు. ఈ సందర్భంగా బ్లూమ్‌బెర్గ్‌ ఫిలాంత్రపీస్‌ ప్రతినిధులు సీఎంను కలిసి సాగర స్వచ్ఛత ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. జీవీఎంసీ ప్రాజెక్టుకు లభించిన గ్లోబల్‌ గుర్తింపు, ప్రాజెక్టు లక్ష్యాలను వివరించారు. పెదజాలరిపేటలో సుమారు 185 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఓషన్‌ ప్లాస్టిక్‌ రికవరీ సెంటర్‌ పైలట్‌ సైట్‌ను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు.

ఒంటరి మహిళకు పెన్షన్ ఇవ్వాలని సీఎం ఆదేశం

ఇదే సందర్భంలో ఆర్‌కే బీచ్‌లో మురిమిక్చర్‌ విక్రయిస్తున్న ఓ మహిళను సీఎం చంద్రబాబు పలకరించారు. ఆమె వ్యాపారం, జీవనోపాధి గురించి అడిగి తెలుసుకున్నారు. మురిమిక్చర్‌ను రుచి చూసిన సీఎం… ఆమె ఒంటరి మహిళ అని తెలుసుకుని, ఆమెకు పెన్షన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *