-మద్యం స్కామ్ పథకరచన, అమలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే సాగింది
-సత్యప్రసాద్‌కు మతిస్థిమితం లేదని, అసలు ఆయన ఎవరో జగన్ కు తెలియదంటూ వైకాపా తప్పుడు ప్రచారం
-నవంబర్ 15,2019న సీఎం ఆదేశాల మేరకే సత్యప్రసాద్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించాలని ప్రిన్సిపల్ అడ్వైజర్ అజయ్ కల్లాం ఉత్తర్వులు ఇచ్చారు
-మద్యం దుకాణాల పర్యవేక్షణ, జే-బ్రాండ్ల స్టాక్, అమ్మకాలు, డిపోల నుంచి క్యాష్ కలెక్షన్ల బాధ్యతలను సత్యప్రసాద్‌కే అప్పగించారు
-రూ. 3,500 కోట్ల మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
-ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దేశంలోనే అతిపెద్ద లిక్కర్ కుంభకోణం పాపాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతుండటంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్ జగన్ అండ్ కో డీఎస్సీ అభ్యర్థులపై, నియామకాలపై బురదజల్లుతోందని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019-2024 మధ్య కాలంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మద్యం మాఫియా ద్వారా దోచుకున్నారు. ఈ దోపిడీ అంతా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్‌లో, జగన్ రెడ్డి కనుసన్నల్లోనే సాగింది. నాటి బెవరేజెస్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ న్యాయస్థానంలో అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలమే దీనికి తిరుగులేని నిదర్శనం. ఈ కుంభకోణానికి పథకరచన, అమలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ బిగ్ బాస్ ఆధ్వర్యంలోనే జరిగిందని స్వయంగా ప్రధాన పాత్రధారులే కోర్టు ముందు నిజాలు ఒప్పుకుంటున్నారు. గత ఐదేళ్ల పాలనలో ‘జాబ్ క్యాలెండర్’ పేరుతో నిరుద్యోగ యువతను నట్టేట ముంచారు. ఒక్క డీఎస్సీ కూడా సక్రమంగా నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడిందని విమర్శించారు.
డీవీ సత్యప్రసాద్‌ను ఏరికోరి నియమించిందే జగన్ రెడ్డి.. ఇప్పుడు పిచ్చివాడంటూ బురదజల్లుతారా?
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ డీవీ సత్యప్రసాద్‌ను ఎవరో అనామకుడని, సీఎం ముఖం కూడా ఎన్నడూ చూడలేదని, 2014 నుంచే ఆయనకు మతిస్థిమితం లేదంటూ వైఎస్సార్‌సీపీ రోత సాక్షి పత్రికలో రాస్తున్న రాతలన్నీ పచ్చి అబద్ధాలని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆధారాలతో బట్టబయలు చేశారు. “సత్యప్రసాద్ ఎవరో జగన్ రెడ్డికి తెలియదా? సీఎం మొహం కూడా ఆయన చూడలేదా? రేపు హోంగార్డుతో సీఎంపై ఆరోపణలు చేయిస్తారా అంటూ రోత పత్రికలో సిగ్గులేకుండా రాతలు రాస్తున్నారు. ఎవరో దారినపోయే దానయ్య అని చిత్రీకరిస్తున్న అదే సత్యప్రసాద్‌ను ఏరికోరి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌లో స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది సాక్షాత్తూ ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కాదా?” అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. 15-11-2019 తేదీన సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం సంతకంతో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి అత్యవసర ఆదేశాలు జారీ అయ్యాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కోరుకున్నారని పేర్కొంటూ అజయ్ కల్లాం లేఖ రాసిన విషయం వాస్తవం కాదా? సీఎంఓ నుంచి నోట్ (CMP No. 563, Dated: 15.11.2019) రాగానే, అదే రోజు (15-11-2019) ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ డి. సాంబశివరావు మెమో జారీ చేశారు. సీఎంఓ ఆదేశాలను రెఫరెన్స్‌గా ఉంచుతూ, సత్యప్రసాద్‌ను వెంటనే బెవరేజెస్ కార్పొరేషన్‌లో స్పెషల్ ఆఫీసర్‌గా పోస్ట్ చేసి, ప్రభుత్వానికి ‘కంప్లయన్స్ రిపోర్ట్’ పంపాలని ఎక్సైజ్ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం 27-11-2019 నాటికి పోస్టింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మీరు చెబుతున్నట్లు సత్యప్రసాద్ నిజంగానే 2014 నుంచే మతిస్థిమితం లేని మానసిక రోగి అయితే, అటువంటి వ్యక్తిని ఆగమేఘాల మీద బెవరేజెస్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించాలని జగన్ రెడ్డి ఎందుకు కోరుకున్నారు? ఒక మానసిక రోగి మరొక మానసిక రోగిని కోరుకున్నారా? చేతిలో రోత పత్రిక ఉంది కదా అని ప్రతి లైనులోనూ ఇంత పచ్చి అబద్ధాలు రాస్తారా? ఒకవైపు మీరే ఏరికోరి కీలక బాధ్యతల్లో కూర్చోబెడతారు.. తీరా మీ లిక్కర్ కుంభకోణం పాపాలు బట్టబయలయ్యేసరికి ఆయన ఎవరో తెలియదు, ఆయనొక పిచ్చోడు అని ముద్ర వేస్తారా? అవినీతి ఆధారాలు బయటకు వస్తుండటంతో తట్టుకోలేక, కీలక సాక్షులపై ఇలాంటి అసత్యాలు, దిగజారుడు కథనాలు ప్రచురించడం గొడ్డలిపార్టీ నైజమని, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో నడిచే ఈ రోత రాతలను ప్రజలెవరూ నమ్మరని పట్టాభిరామ్ స్పష్టం చేశారు.
రూ.3,500 కోట్ల మద్యం దోపిడీకి తాడేపల్లి ప్యాలెస్‌లోనే మాస్టర్ ప్లాన్
దాదాపు రూ.3,500 కోట్ల భారీ లిక్కర్ కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటనేది ముందే తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఖరారైందని, దీనికి సంబంధించి డీవీ సత్యప్రసాద్‌కు అప్పగించిన బాధ్యతలే తిరుగులేని ఆధారాలను కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బయటపెట్టారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని తెచ్చినట్టే, సత్యప్రసాద్‌ను ఏరికోరి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించి ఆయనకు అప్పగించిన బాధ్యతలపై 27-11-2019న ఆనాటి ఎండీ స్వయంగా సంతకం చేసిన అధికారిక ఆదేశాల కాపీని పట్టాభిరామ్ ప్రదర్శించారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఆయన రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు (APSBCL అవుట్‌లెట్లు) ఎలా పనిచేస్తున్నాయో మానిటర్ చేయడం. మద్యం దుకాణాల్లో స్టాక్, సేల్స్, స్పేస్ మేనేజ్‌మెంట్ చూడటం. అంటే.. ఏ షాపులో ఏ జే-బ్రాండ్లు ఉండాలి, వాటిని ఎలా అమ్మించాలనే పూర్తి పెత్తనం అప్పగించారు. డిపోల నుంచి దుకాణాలకు సరుకు పంపడం, అక్కడి నుంచి వచ్చే నగదును పర్యవేక్షించడం. ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి డిజిటల్ చెల్లింపులు లేకుండా పూర్తిగా నగదు రూపంలోనే వేల కోట్ల రూపాయలను నడిపించేందుకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతలే తాడేపల్లి ప్యాలెస్ నడిపిన లిక్కర్ మాఫియా నెట్‌వర్క్‌కు ప్రత్యక్ష నిదర్శనమని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. పొద్దున్న లేస్తే తాడేపల్లి స్క్రిప్టు పట్టుకుని మొరిగే పేర్ని నాని.. ఇప్పుడు మాట్లాడవేం? సాక్షాత్తూ జగన్ రెడ్డి ఆదేశాలతో సీఎంఓ లెటర్ హెడ్ ద్వారా సత్యప్రసాద్‌ను నియమించిన అధికారిక పత్రాలతో మీ బట్టలు ఊడదీశాం. సత్యప్రసాద్ మానసిక రోగి అయితే, ఈ కీలక బాధ్యతలను సీఎం కార్యాలయం ఎందుకు అప్పగించింది? రేపు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సూటిగా సమాధానం చెప్పు. పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేయలేక, తాడేపల్లి కొంపకు వెళ్లి అక్కడ కూర్చున్న జీతగాడి ముందే కన్నీళ్లు పెట్టుకో అని ఎద్దేవా చేశారు. ఈ భారీ కుంభకోణం పాపాలను కప్పిపుచ్చుకోవడానికే బందరు నుంచి పేర్ని నాని కొడుకును, విజయవాడ నుంచి గుణదల దేవినేని అవినాష్‌లు మద్యం తాగించిన రౌడీ మూకలతో టీచర్ల మీదికి ఉసిగొల్పారని మండిపడ్డారు. విద్య నేర్పిన గురువులపైనే బూతులు తిట్టిస్తూ, రాళ్లతో దాడులు చేయిస్తారా? మీరేమైనా చదువుసంధ్యలు నేర్చుకున్నారా? అని నిలదీశారు. రౌడీ మూకలను వెంటేసుకుని రోడ్లపై వీరంగం వేయడం కాదు దేవినేని అవినాష్.. నీకు అంత దమ్ము, ధైర్యం ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ నగర మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీ చెయ్. ఎన్డీయే కూటమి తరపున నీకు డిపాజిట్ కూడా రాకుండా ప్రజలే బుద్ధి చెబుతారు. ఇప్పటికే ఓటములతో భయపడి ప్యాంట్లు తడుపుకుంటున్న నువ్వు.. రోడ్లపై టీచర్ల మీద పడి దాష్టీకాలు చేయడం సిగ్గుచేటని పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
రూ.20 కోట్ల కేఎన్ఆర్ ఖాతా గుట్టు రట్టు.. లిక్కర్ పాపం కప్పడానికే డీఎస్సీపై జగన్ ముఠా డైవర్షన్ డ్రామా
లిక్కర్ కుంభకోణం పాపాలు, జగన్ రెడ్డి పీఏ కేఎన్ఆర్ ఖాతాలోకి చేరిన రూ.20 కోట్ల అక్రమ సొమ్ము ఆధారాలు బట్టబయలవడంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్సార్‌సీపీ ముఠా డీఎస్సీ అభ్యర్థులపై బురదజల్లుతోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 2025లోనే డీఎస్సీ ఫైనల్ జాబితా విడుదలైంది. దాదాపు తొమ్మిది నెలల పాటు, అంటే మే 2026 వరకు దీనిపై పల్లెత్తు మాట మాట్లాడని జగన్ బ్యాచ్.. ఇప్పుడే ఎందుకు రాద్ధాంతం చేస్తోంది? లిక్కర్ స్కామ్ మూలాలు, దర్యాప్తు వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుండటం, జగన్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కేఎన్ఆర్ ఖాతాలోకి రూ.20 కోట్లు చేరిన సాక్ష్యాలు బయటపడటంతో భయపడి ప్రజల దృష్టి మళ్లించడానికే అర్జెంట్‌గా డీఎస్సీ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. కష్టపడి మెరిట్ సాధించి ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు, మహిళా అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను స్క్రీన్ల ముందే బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. “మేము మూడుసార్లు టెట్ రాశాం.. ఇవిగో మా మార్కుల పత్రాలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు.. నీ వాట్సాప్ నెంబర్ ఇవ్వు జగన్ రెడ్డి, నీకే పంపిస్తామని ఓ ఆడబిడ్డ సూటిగా విసిరిన సవాల్‌కు జగన్ సమాధానం చెప్పగలడా? సర్టిఫికెట్లు అడిగితే ‘నేను ఫోనే వాడను’ అని తప్పించుకునే రకం జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. నిజాయితీగా పరీక్షలు రాసిన నిజమైన అభ్యర్థులు, క్రీడాకారులు ఒకవైపు ఉంటే.. వైఎస్సార్‌సీపీ పంపిన మద్యం మత్తులో ఉన్న రౌడీషీటర్లు, గంజాయి ముఠాలు వారిపై రాళ్లు, రాడ్లు, కోడిగుడ్లతో దాడికి దిగడం అత్యంత హేయం. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ అధికారి డీవీ సత్యప్రసాద్ ఎవరో తెలీదు, ఆయనొక మానసిక రోగి అంటూ తమ రోత పత్రిక సాక్షిలో అసత్యాలు రాస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలకు సిగ్గుండాలి. ఆయనను ప్రత్యేకంగా కోరుకుని నియమించాలని సాక్షాత్తూ జగన్ రెడ్డి సీఎంవో నోట్ ద్వారా లేఖ పంపడం, వెంటనే అదే రోజు సీఎస్ ఉత్తర్వులు ఇవ్వడం, అనంతరం మద్యం షాపుల మానిటరింగ్, జే-బ్రాండ్ల స్టాక్ సేల్స్, వేల కోట్ల క్యాష్ కలెక్షన్లను సత్యప్రసాద్ చేతుల మీదుగానే నడిపించేలా డ్యూటీ ఆర్డర్లు ఇవ్వడం అధికారిక పత్రాలతో సహా రుజువైంది. ఇంతకంటే స్పష్టమైన ఆధారాలు ఏం కావాలని నిలదీశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు నిరుద్యోగులకు డీఎస్సీ ద్వారా పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించారన్న కడుపుమంటతోనే జగన్ ఈ కుట్రలకు తెరలేపారు. 11 సీట్లకు కుంచించుకుపోయి, అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక రోడ్లపై రౌడీలను వదిలి వీరంగం వేయిస్తున్నారని మండిపడ్డారు.
లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకే ఉపాధ్యాయులపై వైఎస్సార్సీపీ దాడులు, విషప్రచారం
2024 జూన్‌లో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరగానే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన మొట్టమొదటి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశారు. చెప్పిన మాట ప్రకారం అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి, సుమారు 16,000 మందికి పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించి పేదల ఇళ్లల్లో వెలుగులు నింపారు. రేయింబవళ్లు కష్టపడి చదివి, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై, డీఎస్సీ ప్రక్రియపై వైఎస్సార్సీపీ నాయకులు పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారు. విజయవాడలో నిరుద్యోగులను రెచ్చగొట్టి చేస్తున్న కుట్రలన్నీ లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే. తమ అవినీతి బండారం బయటపడుతుందన్న భయంతోనే అర్హులైన ఉపాధ్యాయులపై, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు, నిరుద్యోగ యువత జగన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలను గమనిస్తున్నారని, తప్పు చేసిన మద్యం మాఫియా సూత్రధారులు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ రెడ్డికి మొదటినుంచీ చదువుకున్న వారిపై, ముఖ్యంగా ఉపాధ్యాయులపై తీవ్రమైన అక్కసు ఉందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయులను అత్యంత హీనంగా చూశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుకు మారువేషాల్లో చేరుకున్న ఉపాధ్యాయులపై అక్రమ ఆంక్షలు విధించి, లాఠీఛార్జీలు చేయించి కిరాతకంగా వ్యవహరించిన చరిత్ర ఆయనది. వేల కోట్ల లిక్కర్ దందా ఆగకూడదన్న దురాశతో, కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో కూడా ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టి క్యూలైన్లు మేనేజ్ చేయించిన దుర్మార్గమైన ఆలోచన జగన్ రెడ్డికే చెల్లింది. గురువులకు అటువంటి దుస్థితి కల్పించినందుకు ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. కష్టపడి ఉద్యోగాలు సాధించి, తమ సర్టిఫికెట్లను బహిరంగంగా చూపించి తమపై నిరాధార ఆరోపణలు చేయవద్దని వేడుకుంటున్న ఉపాధ్యాయులపై వైఎస్సార్‌సీపీ రౌడీలు, గంజాయి బ్యాచ్‌లతో దాడులు చేయించడం అత్యంత హేయం. రాళ్లు, కోడిగుడ్లు, ఇనుప రాడ్లతో ఉపాధ్యాయులపై దాడికి తెగబడిన ఈ “గొడ్డలి పార్టీ” ముఠా సమాజానికి ఏం సందేశం ఇస్తోంది? తల్లి, తండ్రి తర్వాత గురువును పూజించే సంస్కృతి మనది అయితే, గురువులపై భౌతిక దాడులకు తెగబడటమే మీ సంస్కారమా? తమ లిక్కర్ కుంభకోణం పాపాలు బట్టబయలవుతుంటే, ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే పథకం ప్రకారం ఉపాధ్యాయులపై దాడులు చేయిస్తున్నారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌లో స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేసి, డిస్టిలరీల ఆర్డర్లు, స్టాక్ మెయింటెనెన్స్, ఇండెంట్ల వ్యవహారాలన్నీ ప్రత్యక్షంగా చూసిన డీవీ సత్యప్రసాద్‌పై వైఎస్సార్‌సీపీ రోత సాక్షి పత్రికలో అసత్య కథనాలు రాస్తున్నారు. 2014 నుంచే ఆయనకు మతిస్థిమితం లేదంటూ తప్పుడు పత్రాలు సృష్టించి పిచ్చివాడిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘సాధారణ ఉద్యోగి సీఎంను కలవడం సాధ్యమా? సీఎం మొహం అయినా చూశాడా?’ అంటూ రాస్తున్న రాతలు వీరి నిస్సిగ్గు రాజకీయాలకు పరాకాష్ట. మీ నాయకుడి అవినీతి బాగోతాలు బహిర్గతమవుతున్న నేపథ్యంలో, గొడ్డలి పార్టీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తాడేపల్లి కొంపకు వెళ్లి జగన్ రెడ్డిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై భౌతిక దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
లిక్కర్ దోపిడీదారులకు జైలు తప్పదు.. అక్టోబర్‌లో మరో డీఎస్సీ నిర్వహించి తీరుతాం
లిక్కర్ కుంభకోణంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన దోషులు ఎంతటి వారైనా సరే చట్టం ముందు దోషులుగా నిలబెట్టి జైలుకు పంపడం ఖాయమని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలెస్ అధినేత జగన్ రెడ్డి అయినా, మరెవరైనా కటకటాలు లెక్కపెట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎన్ని కుట్రలు పన్నినా, ఎంత కడుపుమంటతో ఏడ్చినా యువతకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో రాబోయే అక్టోబర్ నెలలో ఖచ్చితంగా మరో మెగా డీఎస్సీని నిర్వహిస్తాం. అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకో రెండు డీఎస్సీలను కూడా పూర్తి చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని అమలు చేసేందుకు లోకేష్ గారు పారదర్శకంగా, దృఢ సంకల్పంతో కృషి చేస్తుంటే ఓర్వలేక వైఎస్సార్‌సీపీ నేతలు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. వాళ్లు ఏడుస్తూనే ఉంటారు.. మేము చేసే మంచి పనులతో ముందుకు వెళ్తూనే ఉంటాం. విజయవాడ నడిబొడ్డున గంజాయి మత్తులో, మద్యం తాగి మారణాయుధాలు, రాళ్లు, కోడిగుడ్లతో రోడ్లపై వీరంగం సృష్టించిన రౌడీషీటర్ల ఆగడాలన్నీ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఎవరు ఎక్కడెక్కడ ఏమేం దౌర్జన్యాలు చేశారో పోలీసుల వద్ద పూర్తి ఆధారాలున్నాయి. రేపటి నుంచే చట్టపరమైన విచారణ, కఠిన చర్యలు మొదలవుతాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధ్వంసాలు సృష్టిస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదు. దేవినేని రౌడీషీటర్లు, గంజాయి ముఠాలను వెంటేసుకుని రోడ్లపై దౌర్జన్యాలు చేయడం కాదు.. జీవితంలో ఒక్క ఎన్నిక కూడా గెలవని నువ్వు నిజమైన నాయకుడివైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకో. దమ్ముంటే విజయవాడ నగర మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీ చెయ్. నీకు డిపాజిట్ కూడా దక్కకుండా ప్రజలే బుద్ధి చెబుతారు. ఇంకా ఎన్ని రోజులు ఈ సంఘవిద్రోహ శక్తులను అడ్డం పెట్టుకుని బతుకుతావ్? ఇప్పటికైనా రౌడీయిజం మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
Prajavartha Online Telugu News