-అక్టోబర్ 22, 23 తేదీల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన: ఆర్టీసీ జేఏసీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసీలో రెండో దశలో ప్రవేశపెట్టనున్న 1,450 ఏసీ విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నిర్వహించేందుకు జారీ చేసిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కె.ఎస్. బ్రహ్మానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
29 ఆర్టీసీ డిపోల్లో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) విధానంలో ప్రైవేటు సంస్థల ద్వారా బస్సుల నిర్వహణను చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ బస్సులకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఆర్టీసీయే బస్సులను కొనుగోలు చేసి, సొంత ఉద్యోగులతో నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే ఆర్టీసీ ఆదాయం, ఉద్యోగావకాశాలు, ఉద్యోగుల భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
స్త్రీశక్తి పథకంతో పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 4 వేల కొత్త బస్సులను సమకూర్చాలని, ఖాళీగా ఉన్న సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2, మంగళం డిపోలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు టెండర్ల రద్దు కోరుతూ ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన తెలుపుతారని జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ నెల 26న విజయవాడలో జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోతే అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ కో-కన్వీనర్లు పి.వి. రమణారెడ్డి, జి.వి. నరసయ్య, సి.హెచ్. సుందరయ్య, కట్టా సుబ్రహ్మణ్యం, ఎస్.వి. శేషగిరిరావు, వై.ఎస్. రావు, కె. సూర్యప్రకాశరావు, డి. మాలాద్రి హెచ్చరించారు.
Prajavartha Online Telugu News