విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మారిస్ స్టెల్లా కళాశాల (స్వయంప్రతిపత్తి) ఆర్థికశాస్త్ర విభాగం, హైదరాబాద్లోని భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి దక్షిణ ప్రాంతీయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో “ప్రపంచీకరణ యుగంలో మహిళా సాధికారత, వ్యవస్థాపకత, సమ్మిళిత వృద్ధి: ఆవిష్కరణలు, సవాళ్లు, విధాన దృక్పథాలు” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. అక్టోబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సును కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఇన్నియసమ్మ గాదె, కరస్పాండెంట్ డా. సిస్టర్ లీనా క్వాడ్రాస్ ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న డ్రీమ్ నెరేటివ్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నిమిష లింగమనేని మాట్లాడుతూ మహిళా సాధికారత ప్రాధాన్యతను వివరించారు. ముఖ్యంగా యువత చైతన్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
హైదరాబాద్లోని ఐసీఎఫ్ఏఐ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డా. తమ్మా కోటి రెడ్డి కీలకోపన్యాసం చేస్తూ మహిళా సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలు, విధానపరమైన దృక్పథాలను వివరించారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య బత్తుల శ్రీనివాస్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఇన్నియసమ్మ గాదె మాట్లాడుతూ మహిళా వ్యవస్థాపకత, సాధికారత ప్రస్తుత సమాజంలో ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక అభివృద్ధి, సమ్మిళిత వృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.
సదస్సు సంయోజకులు డా. ఎన్. సత్యవేదం కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. నిర్వహణ కార్యదర్శి డా. స్వరూప్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొని తమ పరిశోధనా పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకురాలు డా. వై. ఇంద్రకుమారి, అధ్యాపకులు సబ్ లెఫ్టినెంట్ స్వప్న, బి. మానస, ఇతర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News