అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ప్రాథమిక ప్రాణరక్షణ నైపుణ్యాలపై ఏపీసీఆర్డీఏ ఉద్యోగులకు గురువారం రాజధాని అమరావతిలోని రాయపూడి ప్రాజెక్టు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీసీఆర్డీఏ సామాజిక అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్య నిపుణుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన సందర్భాల్లో వైద్య సహాయం అందేలోపు బాధితులకు ప్రాథమిక గుండె-ఊపిరితిత్తుల పునరుజ్జీవ ప్రక్రియ (సీపీఆర్) ద్వారా ఎలా సహాయం అందించాలనే అంశంపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడం, సీపీఆర్ నిర్వహించే సరైన పద్ధతులను ఉద్యోగులకు వివరించారు.
మంగళగిరి ఎయిమ్స్కు చెందిన కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం అదనపు ఆచార్యులు డా. ధ్రుబజ్యోతి జహర్ దేబ్నాథ్, కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ విభాగం సహాయ ఆచార్యులు డా. జి. కీర్తి, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం సీనియర్ రెసిడెంట్ డా. రాజేశ్వరి, అదే విభాగానికి చెందిన ఎహెచ్ఏ ప్రాజెక్టు మేనేజర్ ఎం.డి. షాజాద్ శిక్షణలో పాల్గొని వైద్యపరమైన సూచనలు అందించారు.
శిక్షణలో భాగంగా సీపీఆర్ నిర్వహణ పద్ధతులను ప్రత్యక్షంగా వివరించడంతోపాటు ఉద్యోగులతో సాధన చేయించారు. అత్యవసర సమయాల్లో ఆందోళనకు గురికాకుండా, సరైన సమయంలో సరైన విధంగా స్పందించేందుకు ఇటువంటి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు తెలిపారు. ఉద్యోగులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
ఏపీసీఆర్డీఏ సామాజిక అభివృద్ధి విభాగం గ్రూప్ డైరెక్టర్ వి. రాములు, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఇటువంటి అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని వి. రాములు తెలిపారు.
శిక్షణ ముగిసిన అనంతరం ఎయిమ్స్ వైద్య సిబ్బంది ఏపీసీఆర్డీఏ అధికారులు, ఉద్యోగులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Prajavartha Online Telugu News