అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలో గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్థ (హడ్కో) బృందం చేపట్టిన రెండు రోజుల పర్యటన గురువారం ముగిసింది. బుధ, గురువారాల్లో అమరావతిలో పర్యటించిన బృందం రెండో రోజు పలు మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులను సందర్శించింది. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న ఈ2, ఈ4, ఈ5, ఈ7, ఈ11, ఈ13, ఈ15, ఎన్8 రహదారులతో పాటు, భూ సమీకరణ పథకంలోని పదో జోన్ ప్రాజెక్టు పనులను హడ్కో బృందం పరిశీలించింది. ఆయా ప్రాజెక్టుల వద్ద జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించిన బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏపీసీఆర్డీఏ ఇంజినీర్-ఇన్-చీఫ్ ఆర్. గోపాలకృష్ణారెడ్డి, ఇతర అధికారులు ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పనుల వివరాలు, ప్రస్తుత పురోగతిని హడ్కో బృందానికి వివరించారు. హడ్కో బృందంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీఎస్ఏ మూర్తి, జనరల్ మేనేజర్ (ప్రాజెక్టులు) సయ్యద్ రహీముద్దీన్, సీనియర్ మేనేజర్ (ప్రాజెక్టులు) టి. సుబ్బారావు, సీనియర్ మేనేజర్ (ప్రాజెక్టులు) రామ్ సింగ్ మీనా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News