అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామ రైతులకు గురువారం ఈ-లాటరీ విధానం ద్వారా 76 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో రైతుల సమక్షంలో ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 26 మంది రైతులకు కేటాయించిన ప్లాట్లలో 41 నివాస, 35 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి.
రాజధాని నిర్మాణం కోసం ఇటీవల భూములిచ్చిన రైతులు, సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికి భూములిచ్చిన ఒక రైతుతో పాటు, గతంలో ప్లాట్లు పొందినప్పటికీ వీధి పోటు, న్యాయస్థాన కేసులు, భూసేకరణకు సంబంధించిన సమస్యలున్న స్థలాల్లో ప్లాట్లు కేటాయించబడిన రైతుల విజ్ఞప్తులను అధికారులు పరిశీలించారు. అర్హులైన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు ఈ-లాటరీ నిర్వహించారు.
రైతుల సమక్షంలో ఆన్లైన్ ర్యాండమ్ విధానం ద్వారా ముందుగా నివాస, వాణిజ్య ప్లాట్లకు ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం అసలు లాటరీ ప్రక్రియను చేపట్టారు. లాటరీలో ప్లాట్లు పొందిన రైతులకు ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ కె. కార్తీక్, పెనుమాక ప్రత్యేక ఉప కలెక్టర్ కె. సుధారాణి తాత్కాలిక కేటాయింపు ధ్రువపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కె. కార్తీక్ మాట్లాడుతూ, ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. రైతులకు కేటాయించిన ప్లాట్లు భౌగోళికంగా ఎక్కడ ఉన్నాయో గుర్తించేందుకు భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) సిబ్బంది, గ్రామ సర్వేయర్లు సహకరిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రణాళిక, భూములు, సమాచార విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News