Breaking News

దక్షిణ ప్రాంతీయ సీబీఆర్‌ఎన్‌ పోటీల్లో తమిళనాడు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ జట్టు విజయం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ, దక్షిణ మధ్య ప్రాంతీయ స్థాయి సీబీఆర్‌ఎన్‌ (రసాయన, జీవ, రేడియోలాజికల్‌, అణు ప్రమాదాలు) పోటీల్లో తమిళనాడు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) విజేతగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని పదో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బెటాలియన్‌ ఆధ్వర్యంలో అక్టోబరు 12 నుంచి 15 వరకు నాలుగు రోజులపాటు ఈ పోటీలను నిర్వహించారు.

ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయి. రసాయన, జీవ, రేడియోలాజికల్‌, అణు సంబంధిత ప్రమాదాల సమయంలో సమర్థంగా స్పందించేలా బృందాల సామర్థ్యాన్ని పెంపొందించడం, వివిధ విపత్తు నిర్వహణ సంస్థల మధ్య సమన్వయం, నైపుణ్యాలు, ఉత్తమ విధానాల మార్పిడిని ప్రోత్సహించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

గురువారం సాయంత్రం పదో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌ ప్రాంగణంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ఆపరేషన్స్‌ విభాగం ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సీహెచ్‌. శ్రీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు పదో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ వి.వి.ఎన్‌. ప్రసన్న కుమార్‌, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) సంయుక్త సంచాలకులు కల్నల్‌ పి.ఎన్‌. రెడ్డి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సీహెచ్‌. శ్రీకాంత్‌ మాట్లాడుతూ ప్రాంతీయ స్థాయి సీబీఆర్‌ఎన్‌ పోటీలను సమర్థంగా నిర్వహించిన పదో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌ను అభినందించారు. విపత్తుల సమయంలో సమర్థవంతంగా స్పందించడం, ప్రమాదాలను నియంత్రించడం, సహాయక చర్యలు చేపట్టడంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు తమ నైపుణ్యాలు, అనుభవాలను ప్రదర్శించేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలిచాయని పేర్కొన్నారు.

అనంతరం విజేత తమిళనాడు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందానికి, రన్నరప్‌ ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందానికి ట్రోఫీలు, పతకాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ వినియోగించే విపత్తు సహాయక పరికరాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …