-కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రెండవ సాధారణ పురపాలక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఉదయం విఎంసి ప్రధాన కార్యాలయంలోని ఎలక్షన్ సెల్, కౌన్సిల్ బిల్డింగ్, కౌన్సిల్ హాల్, మేయర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో పాటు ఆంధ్రా లయోలా కాలేజ్ గ్రౌండ్స్, బృందావన్ కాలనీలోని 9, 11వ వార్డుల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలను సందర్శించి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆంధ్రా లయోలా కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్‌లు, ఎన్నికల సామగ్రి భద్రత, బ్యాలెట్ బాక్సుల కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను కమిషనర్ సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల సామగ్రిని భద్రపరిచే విధానం, కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన వసతులు, నిర్ణీత సమయంలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను సత్వరమే ప్రకటించేందుకు చేపట్టిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం ఎన్నికైన 86 మంది కార్పొరేటర్లకు అనుగుణంగా విఎంసి ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ బిల్డింగ్, కౌన్సిల్ హాల్లో అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మేయర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అలాగే, బృందావన్ కాలనీలోని 9, 11వ వార్డుల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు. ఆంధ్రా లయోలా కాలేజ్ గ్రౌండ్స్‌లో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లతో పాటు, ఎన్నికల సామగ్రి భద్రతకు సంబంధించిన చర్యలు పటిష్టంగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రతి దశకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అవసరమైన వేదిక, ఇతర వసతులను కూడా ముందస్తుగా సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో అదనపు కమిషనర్లు ఎ. రవీంద్రరావు, డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ డి.ఎస్.ఎస్. శ్రీనివాస్, మేయర్ రిటర్నింగ్ అధికారి, హౌసింగ్ పీడీ రజనీకుమారి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News