-దోమల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్ డ్రైవ్ ను వారం రోజుల పాటు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మలేరియా అధికారులు, శానిటేషన్ సెక్రటరీలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హై రిస్క్ ప్రాంతాలపై ఆరా తీశారు. ఆయా ప్రాంతాలలో పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని, ఫాగింగ్ ఆటోలు, హ్యాండ్ స్ప్రేయింగ్ యంత్రాలని పెంచుకోవాలన్నారు. దోమలు వృద్ధి కేంద్రాలను ఎప్పటికప్పుడు గుర్తించి.. లార్వా దశలోనే నియంత్రించడంపై దృష్టిసారించాలన్నారు. దోమల వృద్ధికి ఆవాసాలైన మురికి కుంటలు, కాలువలలో గుర్రపుడెక్కను తొలగిస్తూ రసాయనాలను పిచికారి చేయాలన్నారు. కాలువలు, కుంటల్లో ఆయిల్ బాల్స్ వేసి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. పగలు రాత్రి రెండు పూట్ల ఫాగింగ్ ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు. మరోవైపు శానిటేషన్ సెక్రటరీలు ALO ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యత గురించి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. తెల్లవారుజాము నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఇదే సమయంలో మలేరియా సిబ్బందికి, సచివాలయ కార్యదర్శులకు మధ్య సమన్వయం తప్పనిసరి అని తెలిపారు. అలాగే ఉగాది నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గడప గడపకు కార్యక్రమానికి అధికారులందరూ సంసిద్ధం కావాలని.. ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. కార్యక్రమంలో బయాలజిస్ట్ ఇంచార్జి బాబు శ్రీనివాస్ రావు, మలేరియా ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News