విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చరిత్రలో పదవులను అలంకరించిన వారెందరో ఉన్నా.. చరిత్ర గతిని శాసించిన వారు కొందరే ఉంటారని, అటువంటి వారిలో బాబూ జగ్జీవన్ రామ్ అగ్రగణ్యులని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ రెడ్ సర్కిల్ నందు జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ 114 వ జయంతి వేడుకలలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దళితనేతగా పేరొందిన జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుల్లో ఒకరని, గొప్ప సంఘ సంస్కర్త గా గుర్తింపు పొందారన్నారు. బీహార్ లో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ఆయన బాబూజీగా ప్రసిద్ధులయ్యారన్నారు. అస్పృస్యత నివారణ, దళిత జనోద్దరణ ఉద్యమాలతో ప్రజారంగంలోకి ప్రవేశించారన్నారు. 52 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తరతమ భేదాలు లేకుండా అందరికీ విశేషంగా సేవలందించిన అజాతశత్రువు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. పాఠశాల వయసులోనే రెండు కుండల విధానాన్ని వ్యతిరేకించారని, రిజర్వేషన్‌లో వచ్చే స్కాలర్‌షిప్ కాదని మెరిట్ స్కాలర్ షిప్ పొందిన మేధావి అని కీర్తించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చి దిగుబడులు పెంచిన ఘనత వారికే దక్కుతుందన్నారు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారన్నారు. వారు ఏ పదవి చేపట్టినా సమర్థవంతంగా నిర్వహించి.. ఆ పదవికి గౌరవం తెచ్చేవారన్నారు. బాబూ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం పేదలకు పండ్లను పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు కుక్కల రమేష్, బొంగరాల భాస్కరరావు, వెంకట్రామిరెడ్డి, కొమ్ము చంటి, బెల్లపు వెంకట్రావు, బెల్లపు సత్యనారాయణ, కంభంపాటి మోసెస్, కాజా శంకర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News