-సెంట్రల్ నియోజకవర్గంలో 5,902 మంది విద్యార్థులకు రూ.5.66 కోట్ల లబ్ధి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు చదువు భారం కాకూడదనే మహోన్నత ఆశయంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 2021-22 విద్యా సంవత్సరానికిగానూ రెండో విడత వసతి దీవెన ద్వారా 5,902 మంది విద్యార్థులకు రూ. 5 కోట్ల 66 లక్షల 40 వేలు 5,292 మంది తల్లుల ఖాతాలలో నేడు జమ చేయడం జరిగిందని ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రమంతటా జరిపిన సుదీర్ఘ పాదయాత్రలో విద్యార్థుల కష్టాలను స్వయంగా చూసిన జగనన్న.. వారందరికీ భరోసా కల్పించేలా ‘జగనన్న వసతి దీవెన’ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేల చొప్పున, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను చెల్లించేందుకు ‘జగనన్న వసతి దీవెన’ కార్యక్రమానికి సీఎం రూపకల్పన చేశారన్నారు. పేదరికంలో ఉన్న ఏ ఒక్క విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న సంకల్పంతో పథకాన్ని అమల్లోకి తెచ్చి.. వారి జీవితాలలో చదువుల దీపాలు వెలిగించారన్నారు. ఈ పథకం ద్వారా విద్యారంగంలో డ్రాప్ అవుట్‌లు తగ్గాయని మల్లాది విష్ణు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అందిస్తున్న ఫీజురీయింబర్స్ మెంట్, వసతి దీవెన, అమ్మఒడి, నాడు-నేడు లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కనుకనే ప్రజలు వైఎస్ జగన్ ని తండ్రికి మించిన తనయుడిగా భావిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. భావితరాల తలరాతలు మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు.
Prajavartha Online Telugu News