బంటుమిల్లి/క్షామక్షిపురం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తని, ఇచ్చిన ప్రతి హామీని తూచ తప్పకుండా నెరవేరుస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం సాయంత్రం బంటుమిల్లి మండలం, పెదతుమ్మిడి గ్రామంలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పంపిణీ, గ్రామ/వార్డు వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలో రూ.3.70 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అక్కాచెల్లెమ్మల ఖాతాలో జమవ్వగా బంటుమిల్లి మండల పరిధిలోని 1,131 స్వయం సహాయక సంఘాల్లోని 11,817 మంది డ్వాక్రా మహిళలకు మూడవ విడతగా రూ.93 లక్షల రాయితీ జమ అయ్యిందని తెలిపారు. ఇప్పటివరకు మొదటి విడతగా రూ. 83 లక్షలు, రెండవ విడతగా రూ.78 లక్షలు కలిపి మొత్తంగా 2.55 కోట్ల రూపాయలను డ్వాక్రా సంఘ మహిళలు రాయితిగా పొందారని, ఇదంతా రాష్ట్ర మహిళల ఆర్థికాభవృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న గొప్ప కృషి అని కొనియాడారు. అనంతరం ఆయన బంటుమిల్లి మండల పరిధిలోని వాలంటీర్లకు సేవా పురస్కారాలు ప్రదానం చేశారు. బంటుమిల్లి మండల పరిధిలో మొత్తం 16 సచివాలయాలు ఉండగా, 200 మంది వాలంటీర్లకు సేవా పురస్కారాలు ప్రదానం చేశారు. వారిలో 195 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సేవా మిత్ర పురస్కారాలు, 5 మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున సేవా రత్నా పురస్కారాలు అందించారు. తొలుత ఆయన అర్తమూరు, సాతులురు, చిన తుమ్మిడి గ్రామాల మీదుగా భారీ ర్యాలీగా రాగ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండలం ఎంపిడిఓ పి.వెంకటలక్ష్మీ, తాసిల్దరు కే.గోపాలకృష్ణ, పెదతుమ్మిడి సర్పంచ్ అర్జా యశోదమ్మ, జెడ్పీటీసీ లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల మహిళలు, వైఎస్సార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News