విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మట్టి ఆరోగ్యం కోసం పాటుపడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా నేల సంక్షోభాన్ని పరిష్కరించడానికి సద్గురు ప్రారంభించిన గ్లోబల్ ఉద్యమం “సేవ్ సాయిల్”. సాగు చేసే నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచే విధంగా జాతీయ విధానాలను రూపొందించటానికి వివిధ దేశాల నాయకుల మద్దతును కూడగట్టడానికి చేస్తున్న ప్రయత్నం “సేవ్ సాయిల్”. మనకి తల్లితో సమానమయిన మట్టిని రక్షించటం పై అవగాహన కలిగించటానికి “సేవ్ సాయిల్” కార్యక్రమం మద్దతు గా జార్ఖండ్ చెందిన సామ్రాట్ సింగ్ ఢిల్లీ నుండి సైకిల్ మీద కోయంబత్తూరు వరకు వెళ్ళుతూ విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భం గా “కమీషనర్ అఫ్ టూరిజం” కన్న బాబు ను వారి కార్యాలయం లో కలసి తన యాత్ర వివరాలు తెలిపారు.
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులయిన సద్గురు మట్టిని రక్షించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం UK నుండి భారతదేశానికి 100 రోజుల ఒంటరి మోటార్‌సైకిల్ ప్రయాణంలో 30,000 కి.మీ.లు ప్రయాణించి, పౌరులు, నాయకులు మరియు నిపుణులను కలుస్తూ ఈ సందేశాన్ని అందరికీ చేరవేస్తున్నారు. ఇది 350 కోట్ల మందికి చేరితే – అంటే ప్రపంచంలో ఓటు హక్కు ఉన్నవారిలో 60% మందికి ఈ సందేశం చేరితే మట్టిలో కనీసం 3-6% సేంద్రీయ పదార్ధం ఉండే దిశగా జాతీయ విధానాలు రూపొందించడానికి అన్ని దేశాల నాయకుల మద్దతు కూడగట్టం సాధ్యమవుతుంది.
మన నేల అంతరించిపోతుందని ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, మనం ఇప్పుడు తగు చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి భూమిపై 90% నేల క్షీణించవచ్చు. UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం మనకు 60 సంవత్సరాలకి సరిపడా మట్టి మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచంలోని వ్యవసాయ భూమిలో 52% ఇప్పటికే క్షీణించిందని కూడా నివేదించింది. భూసార వినాశనాన్ని అరికట్టకపోతే 20 ఏళ్లలో ఆహారోత్పత్తి 40% తగ్గుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. భారతదేశంలోనే, 62% మట్టిలో 0.5% కంటే తక్కువ సేంద్రీయ పదార్థం ఉంది. ఇటువంటి పరిస్థితిలో నేలను రక్షించడానికి ప్రపంచ ఉద్యమం అత్యంత కీలకమైనది.
Prajavartha Online Telugu News