-రాజామహేంద్రవరం ప్రజలకు స్వచ్చమైన జలాలు అందించడమే లక్ష్యం
-క్లీన్ అప్ గోదావరి నినాదం తో .. మిషన్ గోదావరీ
-జిల్లా కలెక్టర్ మాధవి లత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 7.30 కి మిషన్ గోదావరి కార్యక్రమాన్ని నగరంలో నిర్వహిస్తున్నమని కలెక్టర్ మాధవి లత శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాజమహేంద్రవరం లోని గోదావరి పుష్కర్. ఘాట్ వద్ద గోదావరి నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్పూర్తితో చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతుగా భాగస్వామ్యం కావాలన్నారు. గోదావరి నది ప్రక్షాళన కోసం ప్రత్యేక యంత్ర పరికరాన్ని తీసుకుని వచ్చి , ఒక నెల రోజులపాటు దాని సామర్థ్యాన్ని పరిశీలించి, వొచ్చే ఫలితాలు ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత తెలియచేశారు. ఈ ఆధునిక యంత్ర పరికరంతో పాటుగా శానిటేషన్ సిబ్బంది సేవలను కూడా సమాంతరంగా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గోదావరి నది లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రజలు ఎక్కువగా రావడం మూలంగా సాలిడ్ వేస్ట్ , ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను వదిలి వెయ్యడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ దుర్గంధం రావడం జరుగుతోందన్నారు. గోదావరిని పరిశుభ్రంగా ఉంచాలనే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అందులో భాగంగానే మిషన్ గోదావరి కార్యక్రమానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకారం చుడుతున్నామన్నారు . నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేసే ఈ కార్యక్రమం ద్వారా సాలిడ్ వేస్ట్ ను శుభ్ర పరచడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం నగర ప్రజలకు స్వచ్చమైన గోదావరి జలాలు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News