-వొచ్చే వారం నాటికి ప్రగతి దిశగా చర్యలు పూర్తి చెయ్యండి
-ఆసుపత్రిలో ఆరోగ్య శిశువుల ప్రసవాలకు చొరవ తీసుకోండి
-తదుపరి ఆకస్మిక తనిఖీలో ఇదే తీరు ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం
-జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోపాలపురం సి హెచ్ సి పరిధిలో ఉన్న పి.హెచ్.సి. లకు చెందిన సిజెరియన్ డెలివరీ కేసులు తప్పనిసరిగా ఆసుపత్రి లో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు.
గురువారం కలెక్టర్ ఛాంబర్ లో గోపాలపురం సి. హెచ్.సి. డాక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలను పూర్తి స్థాయి లో ప్రజలకు అందుబాటులో కి తీసుకుని వొచ్చే దిశలో పూర్తి సహకారం అందించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రి వైద్యులు డెలివరీ కేసులు చేపట్టేందుకు సిద్దంగా ఉండాలని, అక్కడ అందచేసే వైద్య సేవలు ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని తీసుకుని వొచ్చే భాధ్యత మీదే అన్నారు. అన్ని సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం జరిగినా, సంబందించిన శాఖ ల మధ్య సమన్వయం లోపం వలన నిరుపయోగంగా ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందించే దిశలో అడుగులు వేయడం ముఖ్యం అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా సర్జన్ విభాగంలో పని చేస్తున్న డాక్టర్ పనితీరు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్ లు చెయ్యడం జరిగింది, నివేదిక ఇవ్వాలని డి సి హెచ్ ఎస్ ను కలెక్టర్ ఆదేశించారు. పి హెచ్ సి లలో పనిచేసే డాక్టర్లు కూడా మరింత మెరుగైన పనితీరు చూపాలన్నారు.
ఆసుపత్రిలో డెలివరీ కేసులు, ముఖ్యంగా సిజెరియన్ కేసుకు అవసరమైన పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలని డి సి హెచ్ ఎస్ ను కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. మల్టీ పెరా ఎక్విప్మెంట్, స్టేబిలైజర్ అవసరం ఉందని డాక్టర్లు వెల్లడించారు. కావలసిన వసతులు కల్పించడం జరుగుతుందని, ఆసుపత్రిలో ఆరోగ్య శిశువుల ప్రసవాలకు చొరవ తీసుకోండని స్పష్టం చేశారు. డెలివరీ కేసుకు అవసరమైన ఇండెంట్ పంపి వాటిని సమకూర్చు కోవాలన్నారు. విద్యుత్ కి సంబంధించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకై కేటాయించిన రూ.4.48 లు ఖర్చు చేసినా, సంబందించిన పనులు జరగక పోవడం పై కలెక్టర్ ఆరా తీశారు. సదరుపనులు జరగకపోవడంతో ఆసుపత్రి నిర్మాణం జరిగి , వైద్యులు అందుబాటులో ఉన్నా ఏమిప్రయోజనం అని ప్రశ్నించారు.పనులు జరగకుండా చెల్లింపులు జరిగినందున, ఆ సమయంలో విధుల్లో ఉన్న వారిపై నివేదిక ఇవ్వాలని, అవసమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డి సి హెచ్ ఎస్ డా. సనత్ కుమారి, సి హెచ్. సి. సూపరింటెండెంట్ డా. నరేంద్ర ప్రసాద్, ఈ ఈ /ఎపి ఎం ఐ డి సి కే. ఉమాశంకర్ , తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News