-స్వరాజ్ మైదాన్ రైతుబజారుకు ప్రత్యామ్నాయంగా నగరంలో మరో నాలుగు రైతుబజార్లు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రైతుబజార్లను మరింత పటిష్టపరచి ప్రభుత్వం నిర్థేశించిన ధరలకే వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను విక్రయించేలా చర్యలు తీసుకుంటామని స్వరాజ్ మైదాన్ రైతుబజారుకు ప్రత్యామ్నాయంగా నగరంలో మరో నాలుగు రైతుబజార్లను త్వరలో ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు.
మెగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న రైతుబజారును శనివారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మైలవరం తిరువూరు ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేటలతో పాటు నగరంలో పటమట, పాయకాపురం, సింగ్‌నగర్, కేదారేశ్వరపేట, భవానిపురం ప్రాంతాలలో రైతుబజార్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో స్వరాజ్ మైదన్‌లో నిర్వహించిన రైతుబజార్‌ను తరలించి వినియోగాదారులు, రైతులకు ఇబ్బంది కలగకుండా కృష్ణలంక ఫైర్‌స్టేషన్, సిద్ధార్థ కళాశాల, శాతవాహన కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన రైతుబజార్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సమీపంలోని కాలువ గట్టుపైన సాంబమూర్తి రోడ్డు, జిఎస్‌రాజు రోడ్డు, ఆటోనగర్ ఏపిఐఐసి కాలనీలలో శాశ్వత రైతుబజార్ల నిర్మాణం దాదాపు పూర్తి అయిన్నట్లు తెలిపారు. త్వరలో వాటిని ప్రారంభించి వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతుబజార్లలో దళారి వ్యవస్థకు అవకాశం లేకుండా అర్హతగలిగిన రైతులు, స్వయం సహాయ బృందాల ద్వారా నిర్థేశించిన ధరలకు నాణ్యమైన కూరగాయలను విక్రయించేలా జిల్లా జాయింట్ కలెక్టర్, మార్కెటింగ్ శాఖాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. రైతుబజార్ల ఎస్టేట్ అధికారులు ఎటువంటి అవకతవకలు లేకుండా రైతుబజార్లను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
రైతుబజార్ల నిర్వహణలో కలెక్టర్ వెంట జిల్లా అగ్రిట్రేడ్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఏ. కిశోర్, ఎస్టేట్ ఆఫీసర్ కోటేశ్వరరావు, సూపర్‌వైజర్లు అనిల్, ప్రవీణ్ కుమార్ తదితులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News