రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల, లబ్ధిదారుల గృహ నిర్మాణాలు ఇసుక కొరత వలన ఆగిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలులేదని జే పీ. పవర్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాస్థాయి సాండ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవి లత మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా పది రీచ్ లకు అనుమతులు ఇవ్వడం జరిగిందని వీటికి సంబంధించి జెపి పవర్ వెంచర్ వారు రీచ్ లకు సంబంధించి క్లియరెన్స్ కోసం అనుమతులు పొందాల్సిన అన్నారు. ఇప్పటికే జిల్లాలో ఏడు రీచ్ ల పరిధిలో 6,17,298 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నాయని, వీటిని రాబోయే మూడు నెలలకు వినియోగించు కోవడం జరగాలన్నారు. కొత్తగా 10 ఇసుక రీచులు అందుబాటులోకి వచ్చే వరకు ఇసుక సరఫరా కు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవలని స్పష్టం చేశారు. రాజమండ్రి డివిజన్లో వంగలపూడి, కాటవరం రీచ్ లకు, కొవ్వూరు డివిజన్ పరిధిలో ముక్కామల లో రెండు, కాకరపర్రు లో రెండు, ఖండవల్లి, మల్లేశ్వరం, వేగేశ్వరంలో రెండు రీచ్ లకు అనుమతులు మంజూరు చేశామన్నారు. అలాగే రాజమండ్రీ, కొవ్వూరు గోదావరి నది ప్రాంతంలో డీసిల్టేషన్ కోసం రెండు చోట్ల అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ అధికారిక భవన నిర్మాణానికి, పేదలందరికీ ఇళ్లు హౌసింగ్ పనులకు, జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఇసుక సరఫరా చెయ్యాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
డిప్యూటీ డైరెక్టర్ (మైన్స్) ఈ. నరసింహ రెడ్డి, బి. రవి కుమార్, ఏ డీ మైన్స్ ఎమ్. విష్ణు వర్ధన్ రావు, డి పి వి జేవి సత్యనారాయణ, పర్యవరణ అధికారి అశోక్, గ్రౌండ్ వాటర్ డి డి శ్రీనివాస్, జే పీ సంస్థ ప్రతినిధులు భరత్ రెడ్డి, ప్రేమ్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు పంచాయతీ రాజ్, హౌసింగ్ అధికారులతో గృహ నిర్మాణాలు, హౌసింగ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు, రహదారుల నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
Prajavartha Online Telugu News