రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కలవచేర్ల ఇండస్ట్రియల్ కాలనీ లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు స్థలాలు కేటాయింపు కేటగిరీ వారీగా ఏర్పాటు చెయ్యాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో కలవచేర్ల ఇండస్ట్రియల్ కాలనీలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన ప్రతినిధులతో జిల్లా పరిశ్రమల శాఖ, ఏ పి ఐ ఐ సి ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు. జేగురుపాడు, వేములపల్లి ప్రాంతాల్లోని గతంలో పరిశ్రమల కోసం కేటాయించిన వాటిని ఇండ్ల స్థలాలు కేటాయింపు జరిగినందున, వారికి కలవచేర్ల లో ఇండస్ట్రియల్ కాలనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ కాలనీ లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అయితే ఈ కాలనీ లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు స్థలాలు కేటాయింపు సమయంలో కేటగిరీ వారీగా గుర్తించి, ఒకే కారిడార్ లో ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కాలనీలో మొత్తం 197 పారిశ్రామిక యూనిట్స్ స్థాపనలో 300 నుంచి 1800 గజాల వరకు స్థలాలు కేటాయించడం జరుగుతుందని మాధవీలత తెలిపారు. ఆరు క్లస్టర్ గా కాలనీ అభివృద్ధి చేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆయా యూనిట్స్ పరంగా డి పి ఆర్ సమర్పించాలని ఆదేశించారు. జిల్లా పరిశ్రమల అధికారితో ప్రతి వారం సమావేశాలు నిర్వహించి, సత్వరమే ఆయా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు . గ్రామస్థాయి లో ఆదాయ వనరుల అభివృద్ధి కోసం మంచి ప్రతిపాదనలు రూపొందించి క్లస్టర్ యూనిట్స్ కై ఆలోచన చెయ్యాలని పేర్కొన్నారు. ఆరు క్లస్టర్ లుగా అభివృద్ధి చేయడానికి వచ్చిన ప్రతిపాదనల్లో జీడి పిక్కలు, కృసిబుల్స్, సిరామిక్, పాలిమర్, స్టోన్ క్రషర్, అల్యూమినియం క్లస్టర్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు జిల్లా పరిశ్రమల అధికారి బి. వెంకటేశ్వర రావు వివరించారు. గ్రీన్ ఛానల్ కిందకు ఈ పరిశ్రమలు వస్తాయని వారు తెలిపారు. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి అథారిటీ (APEDA) అధికారి టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, పెరవలి మండలంలో ఇత్తడి సామాను, అజ్జరం, ఉసులు మర్రు లో పచ్చళ్ళు తయారీ యూనిట్స్ ఏర్పాటుకు అనుకూలంగా అవకాశాలు ఉన్నాయని, వాటిపై ఆలోచన చెయ్యాలని సూచించారు. ఈ సమావేశంలో డి ఐ సి బి. వెంకటేశ్వర రావు, ఏ పి ఐ ఐ సి డిజిఏం డి. జ్యోత్స్న, ఎల్ డి ఎం జి. దిలీప్ కుమార్, ఎపెడా అధికారి కె. శ్రీనివాసరావు, చిన్న తరహా పరిశ్రమల సంఘం ప్రతినిధులు వి. జగదీష్ బాబు, టి. రామమూర్తి, పి. అప్పారావు, టి. వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News