నిరుపేదలను ఉన్నతులుగా చేయాలన్నదే సీఎం జగన్ ఆశయం

-ధవళేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో టాబ్స్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ భరత్

రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద విద్యార్థులను ఉన్నతులుగా రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌ టాబ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన‌ నాగేశ్వర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎంపీ భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హాజరయ్యారు. సభలో ఎంపీ భరత్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువులో ముందుండాలనే లక్ష్యంతో విద్యారంగ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారన్నారు. అందులో భాగంగానే టాబ్స్ పంపిణీ కార్యక్రమమని చెప్పారు. గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయని ఏ ఒక్క ప్రభుత్వం విద్యారంగంపై సీఎం జగన్ మాదిరిగా దృష్టి సారించలేదన్నారు. కార్పోరేట్ విద్యా సంస్థల మాఫియా పిల్లల తల్లిదండ్రులను నిలువునా దోచుకునేవని, కొంతమందే ఉన్నతులుగా మారేవారన్నారు. ఈనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా సీఎం జగన్ కృషిచేస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నేతలు తెలుగు భాషను చంపేస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. మాతృభాష ఎంత ముఖ్యమో ఆంగ్ల భాష కూడా అంతే ముఖ్యమన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని రంగాలలో మీరు ఉన్నతులుగా రాణించాలంటే ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలని చెప్పారు. సీఎం జగన్ నిస్వార్థంగా పనిచేసే నేత అని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నేత అని, ఇటువంటి వారు చాలా అరుదుగా ఉంటారన్నారు. అభివృద్ధి అంటే రహదారులు, డ్రెయినేజీ లు నిర్మించడమే కాదని, నిరుపేదల జీవన విధానం ఆర్థికంగా మెరుగుపడటం కూడా అభివృద్ధేనని ఎంపీ భరత్ అన్నారు. బాగా చదివి మీ తల్లిదండ్రుల కలలు, జగనన్న ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రత్నకుమారి, ఎంఈవో తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *