22న విజయవాడలో మహాధర్నా.

-జగనన్న ఇళ్లకు రూ.5 లక్షలు చొప్పున ఇవ్వాలి.
-టిడ్ కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీన పరచాలి.
-జ‌గ‌న్ నివాసాలు ఎక‌రాల్లో … పేదల నివాసానికి సెంటు భూమా…?
-జ‌గ‌న‌న్న కాల‌నీలను ఓట్ల కాల‌నీలుగా మారుస్తున్నారు.
-టిడ్కో గృహాల ల‌బ్దిదారుల లిస్టులు మారిస్తే స‌హించం
-టిడ్కో గృహాల‌ను సంద‌ర్శించిన సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె రామ‌కృష్ణ‌, స‌హాయ కార్య‌ద‌ర్శి ముప్పాళ్ల నాగేశ్వ‌రావు

చిల‌క‌లూరిపేట‌, నేటి పత్రిక ప్రజావార్త :
సొంతింటి క‌ల నెర‌వేరుస్తామ‌ని చెప్పి, టిడ్కో గృహ ల‌బ్దిదారుల‌కు ఒక్క రూపాయితో రిజిస్ట్రేష‌న్లు చేయిస్తామ‌ని హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట‌త‌ప్పార‌ని, మ‌హిళ‌లను దారుణంగా వంచించార‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె రామ‌కృష్ణ విమ‌ర్శించారు. శ‌నివారం ప‌ట్ట‌ణంలోని చెరువుల‌కు వెళ్లే దారిలో 52 ఎక‌రాల్లో ఉన్న టిడ్కోగృహాలను శ‌నివారం సీపీఐ రాష్ట్ర స‌హాయ కార్య‌ద‌ర్శి ముప్పాళ్ల నాగేశ్వ‌ర‌రావు, ప‌ల్నాడు జిల్లా కార్య‌ద‌ర్శి ఎ మారుతీవ‌ర‌ప్ర‌సాద్‌, చిల‌క‌లూరిపేట ఏరియా కార్య‌ద‌ర్శి నాగ‌బైరు రామ‌సుబ్బాయ‌మ్మ త‌దిత‌ర నాయ‌కుల‌తో క‌ల‌సి సంద‌ర్శించారు. గృహ స‌ముదాయంలో ఉన్న ల‌బ్దిదారుల నుంచి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా కె రామ‌కృష్ణ మాట్లాడుతూ త ప్రభుత్వం హాయంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేరే విధంగా పేద ప్రజల నుండి రూ. 20,000 50,000 లక్ష డిపాజిట్లు తీసుకొని టిడ్కో గృహాలను నిర్మిస్తే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక రూపాయి తీసుకోకుండా లబ్ధిదారులందరికీ టిడ్కో గృహాలు ఇస్తామని హామీ ఇచ్చార‌ని, నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా రాష్ట్రంలో అర‌కొర‌గా మాత్ర‌మే టిడ్కోఇళ్ల‌ను ల‌బ్దిదారుల‌కు అంద‌జేశార‌ని ఆరోపించారు. చిల‌క‌లూరిపేట‌లో కేవ‌లం 2,200 మందికి ఇళ్లు అందించామ‌ని చెబుతున్నా, కొంత‌మందికి ఇళ్లకు తాళాలు ఇచ్చి స్వాధీనం చేశార‌ని అవీ కూడా స‌రైనా వ‌స‌తులు క‌ల్పించ‌కుండా అంద‌జేశార‌ని వివ‌రించారు.

జ‌గ‌న్ నివాసాలు ఎక‌రాల్లో … పేదల నివాసానికి సెంటు భూమా…?
గ‌తం నుంచి సీపీఐ పేద ప్ర‌జ‌ల‌కు ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలో మూడు సెంట్ల భూమి అంద‌జేయాల‌ని డిమాండ్ చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. కాని పేద ప్ర‌జ‌ల కోసం ఊర్ల‌కు దూరంగా జ‌గ‌న‌న్న ఇళ్లు పేరుతో సెంట భూమి ఇచ్చి కేటాయించి రూ. 1.80ల‌క్ష‌ల‌తో ఇళ్ల నిర్మాణం చేసుకోమ‌న‌డం దుర్మాగ‌మ‌న్నారు. సీఎం జ‌గ‌న్‌కు తాడేప‌ల్లి, హైద‌రాబాద్‌, బెంగుళూరులో ఎక‌రాల ప్రాంగ‌ణంలో ఇళ్లు ఉంటే పేద వారికి మాత్ర‌మే కేవ‌లం సెంటు భూమి కేటాయించ‌టం, అందులోనే ఇచ్చిన ఇస్తున్న డ‌బ్బుతోనే ఇళ్ల నిర్మాణాలు కొన‌సాగాల‌ని వాలంటీర్లు, అధికారుల‌తో ఒత్తిడితేవడం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. పెరిగిన నిర్మాణ‌వ్య‌యంతో ప్ర‌భుత్వం అందిస్తున్న 1.80ల‌క్ష‌ల‌తో క‌నీసం పూనాదులు కూడా పూర్తి కావ‌ని, అధికారులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నా క‌నీసం ప‌ట్టంచుకోకుండా వ్య‌వ‌హ‌రించ‌టం వ‌ల్ల‌ పేద‌వారిప‌ట్ల జ‌గ‌న్‌కు ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్ధం అవుతుంద‌న్నారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణాల కోసం రూ. 5 లక్షలు ఇవ్వడంతో పాటు ఇసుక, సిమెంటు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే అందించాల‌ని, జగనన్న కాలనీలో పేద ప్రజలకు ఇస్తున్న ఇంటి స్థలాలు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చి పేద ప్రజలు కూడా గౌరవంగా ఇల్లు నిర్మించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశాడు. టిడ్కో గృహాల్లో వ‌స‌తులు క‌ల్పించి వెంట‌నే ల‌బ్దిదారుల‌కు అందించాల‌ని, సేక‌రించిన డిపాజిట్ల‌ను ల‌బ్దిదారుల‌కు వెనుక్కు ఇవ్వాల‌ని, ఉచితంగా రిజిస్ట్రేష‌న్లు చేయించి స్వాధీనం చేయాల‌ని కోరారు.
పేదల ప్రజల సొంతింటి కల నెరవేర్చడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉద్యమం సాగించడానికి సీపీఐ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ,ఎమ్మార్వోలకు ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇవ్వడం, జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వ‌ద్ద లబ్ధిదారులతో ధర్నా నిర్వ‌హించ‌టం జ‌రిగింద‌న్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించ లేద‌న్నారు. ల‌బ్దిదారుల‌కు బాస‌టా ఈ నెల‌ 22వ తేదీన విజయవాడలో మహాధర్న నిర్వహించడం జరుగుతుందని ఈ మహాధర్నాలో టిడ్కో గృహాలు, జ‌గ‌న‌న్న కాల‌నీల లబ్ధిదారులు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

జ‌గ‌న‌న్న కాల‌నీల‌ను ఓట్ల కాల‌నీలుగా మారుస్తున్నారు.. ముప్పాళ్ల నాగేశ్వ‌ర‌రావు, సీపీఐ రాష్ట్ర స‌హాయ కార్య‌ద‌ర్శి
జ‌గ‌న‌న్న కాల‌నీల‌ను ఓట్ల కాల‌నీగా మారుస్తున్నార‌ని సీపీఐ రాష్ట్ర స‌హాయ కార్య‌ద‌ర్శి ముప్పాళ్ల నాగేశ్వ‌ర‌రావు ఎద్దేవా చేశారు. జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో రాష్ట్రంలో ఎన్నో అవ‌క‌త‌వ‌కులు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలో పేద‌వారికి మాత్రం క‌నీస సౌక‌ర్యాలు లేకుండా కాల‌నీలు ఏర్పాటు చేశార‌ని మండి ప‌డ్డారు. జ‌గ‌న‌న్న కాల‌నీలు ప్ర‌భుత్వానికి ఓట్లు దండుకొనే కాల‌నీగా క‌నిపిస్తున్నాయ‌ని, పేద‌వారి క‌ష్టాలు ప‌ట్ట‌డం లేద‌న్నారు. ప్ర‌భుత్వం రూ. 10 బ‌ట‌న్ నొక్కి వేస్తున్న‌ట్లు చెబుతూ రూ. 100 లు వ‌సూలు చేస్తుంద‌న్నారు. నేడు టిడ్కో గృహాలు అంద‌జేసినా, పేద‌ల‌కు స్థ‌లాలు పంపిణీ చేసినా సీపీఐ చేసిన పోరాటాల ఫ‌లిత‌మేన‌న్న విష‌యాన్ని ల‌బ్దిదారులు గ‌మ‌నించాల‌న్నారు.

టిడ్కో గృహాల ల‌బ్దిదారుల లిస్టులు మారిస్తే స‌హించం… ఎ మారుతీ వ‌ర‌ప్ర‌సాద్‌, సీపీఐ ప‌ల్నాడు జిల్లా కార్య‌ద‌ర్శి
నాలుగు సంవ‌త్స‌రాలుగా సొంతింటి క‌ల కోసం ఎదురు చూసిన టిడ్కో గృహ‌ ల‌బ్దిదారుల‌కు ప్ర‌భుత్వం అనేక విధాలుగా ఇబ్బందుల‌కు గురి చేస్తుంద‌ని సీపీఐ ప‌ల్నాడు జిల్లా కార్య‌ద‌ర్శి ఎ మారుతీ వ‌ర‌ప్ర‌సాద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ల‌బ్దిదారుల జాబితాను మార్చి త‌మ పార్టీ వారికి కేటాయించ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉంద‌ని ల‌బ్దిదారుల‌కు ఇళ్ల కేటాయింపు నిలిపివేస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం వెంట‌నే చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించి ఇటువంటి చ‌ర్య‌ల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని డిమాండ్ చేశారు. ఏ ఒక్క ల‌బ్దిదారున్ని తొల‌గించినా స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు.

ఇళ్ల‌లోకి పాములు వ‌స్తున్నాయి…తాగునీటి వ‌స‌తి క‌ల్పించాలి…. ల‌బ్దిదారుల గోడు
టిడ్కో గృహాల సంద‌ర్శ‌న‌కు వచ్చిన‌ సీపీఐ కార్య‌ద‌ర్శి కె రామ‌కృష్ణ , పార్టీ బృందానికి ల‌బ్దిదారులైన ప‌లువురు మ‌హిళ‌లు క‌ల‌సి త‌మ స‌మ‌స్య‌లు విన్న‌మించుకున్నారు. నివాసం ఉండే వారికి ఓకే ట్యాంకు నిర్మించార‌ని, రోజుల త‌ర‌బ‌డి అదే నీరు తాగాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు. ఇళ్ల స‌మీపంలో ప‌బ్లిక్ ట్యాప్ ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఇళ్ల స‌మీపంలో పెరిగిన పొద‌ల నుంచి పాములు, విష‌కీట‌కాలు వ‌స్తున్నాయ‌ని ప‌లువురు ఆరోపించారు. కొన్ని ఇళ్ల‌లో శానిట‌రీ పైపులు ఊడి మురుగు నీరు వ‌స్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీరికి రామ‌కృష్ణ‌ భ‌రోసా క‌ల్పిస్తూ బాధితుల‌కు అండ‌గా పార్టీ ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ల‌బ్దిదారుల స‌మ‌స్య‌ల‌ను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రించాల‌ని స్థానిక సీపీఐ నేత‌ల‌కు సూచించారు. కార్య‌క్ర‌మంలో వినుకొండ సీపీఐ ఏరియా కార్య‌ద‌ర్శి బూదాల శ్రీ‌నివాస‌రావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాద్య‌క్షుడు షేక్ సుభాని, ఏపీ రైతు సంఘం ప‌ల్నాడు జిల్లా అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు తాళ్లూరి బాబురావు, ఉల‌వుల‌పాడు రాము, ఏఐటీయూసీ ఏరియా అధ్య‌క్షుడు పేలూరి రామారావు, ఏపీ మ‌హిళా స‌మాఖ్య ఏరియా కార్య‌ద‌ర్శి చెరుకుప‌ల్లి నిర్మ‌ల‌, నాయ‌కులు నాయుడు శివ‌కుమార్‌, చౌటుప‌ల్లి నాగేశ్వ‌ర‌రావు, పి శివ‌లీల‌, బి ల‌లిత‌కుమారి, సృజ‌న్‌, కందిమ‌ళ్ల వెంక‌టేశ్వ‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *