-వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త చర్యలు పాటించాలి….
-చలివేంద్రాలను ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి…
-జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి ఎండలను అధిగమించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, వడదెబ్బ బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవి వడగాల్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యల పై జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు నెలల పాటు అధిక ఉష్నోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దీనిపై ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా బస్టాండ్లు, షాపింగ్ మాల్స్ వద్ద స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఏ.ఎన్. ఎం.లతో సమన్వయం చేసుకుని వడగాల్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. వేసవిలో విద్యుత్ అవసరం అధికంగా ఉంటుందని, విద్యుత్ కి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల అధికారులకు సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేసి మంచినీటి సౌకర్యం, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు, గర్భిణీల సౌలభ్యం కోసం ముందస్తుగా ఓ.ఆర్.ఎస్., సంబందిత ద్రావకాలను సిద్ధంగా ఉంచాలన్నారు. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి ఎలాంటి కొరత లేకుండా ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అటవీ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా నీటి తొట్టెలు యేర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని పబ్లిక్ రద్దీ ప్రాంతాలలో చలి వేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా. మున్సిపల్ కమీషనర్లు బాధ్యత తీసుకోవాలన్నారు.వడదెబ్బ, అతిసారం లాంటి సమస్యలపై వైద్య ఆరోగ్య సిబ్బంది, అధికారులు వెంటనే స్పందిస్తూ తక్షణ సేవలందించాలన్నారు. వడదెబ్బ కేసుల రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఆ వివరాలను నివేదించాలన్నారు. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు కారణంగా వచ్చే వడదెబ్బ (సన్ స్ట్రోక్), డీహైడ్రేషన్ వంటి సమస్యలు.సాధారణంగా వచ్చే వ్యాధులకు సరైన సమయంలో చికిత్స అందించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు వేసవిలో అనవసరంగా బయటకు రాకూడదని అత్యవసర పనులు ఉంటే ఉదయం పూటనే పూర్తి చేసుకోవాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా గొడుగు వాడటం, తెలుపు రంగు, పలుచటి చేనేత వస్త్రాలను ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు వాడటం, వేడిగాలులు తగలకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసు లేదా అంతకంటే ఎక్కువసార్లు మంచి నీరు తాగడం మంచిదన్నారు. ఎండలో తిరిగే సమయంలో నిమ్మరసం, కొబ్బరి నీరు, చల్లని మంచి నీరు త్రాగడం వల్ల వడడెబ్బ నుండి రక్షించుకోగలమన్నారు. అతి శీతల పానీయములు, మంచు ముక్కలతో కూడిన ద్రావకాల వాడకం తగ్గించాలన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలు అత్యంత జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో సంబందిత శాఖల అధికారులు వారికి కేటాయించిన అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు.
టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఫుట్కర్, డిఆర్ఓ కే. మోహన్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ డి.వి.రమణ, డిపిఓ జే. సునీత, ఉన్నారు.
Prajavartha Online Telugu News