వై.ఎస్.ఆర్ కల్యాణమస్తు , షాదీ తోఫా నిధులను తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేసిన ముఖ్యమంత్రి

-వైయస్ఆర్ కళ్యాణ మస్తు, షాది తోఫా కింద 552 మంది లబ్ధిదారులకు రు.3.83 కోట్ల జమ
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా క్రింద 522 మంది లబ్ధిదారులకు రూ.3,82,70,000 ల ఆర్థిక సహాయాన్ని పెండ్లి కుమార్తె తల్లులు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్సార్ కళ్యాణమస్తు / వైఎస్సార్ షాదీ తోఫా కింద జనవరి, ఫిబ్రవరి, మార్చి – 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని  నేరుగా వారి ఖాతాల్లో  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  బటన్ నొక్కి జమ చేశారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ మాధవీలత, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ల తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీ లత మాట్లాడుతూ జిల్లాలో వైయస్ఆర్ కళ్యాణమస్తు కింద పేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ , బీసీ , మైనార్టీ , దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక చేయూత నిచ్చి, వివాహం కు ఆర్థిక భరోసా నివ్వడం జరుగుతోందని అన్నారు.

పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లల వివాహ సమయంలో సామాజిక బాధ్యత తో రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ వైయస్ఆర్ కళ్యాణ మస్తు, వైయస్ఆర్ తోఫా కింద ఆర్థిక భరోసాన్ని కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. ఇందుకు గాను కనీస విద్యా అర్హత 10 వ తరగతి గా నిర్ణయించడం ద్వారా విద్య యొక్క అవశ్యకత కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అన్నారు.

జిల్లాలో తద్వారా ప్రయోజనం పొందిన లబ్దిదారుల వివరాలు కులాంతర వివాహాలు 40 మంది, ఒకే కులంలో వివాహం చేసుకున్నవారు 482 మంది ఉన్నారని, మొత్తం 522 మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చడం జరిగిందని, ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఇందులో కులాంతర వివాహం చేసుకున్న వారిలో బిసిలు 20, భవన నిర్మాణ కార్మికులు 6 , ఎస్సీ 13 , ఎస్టీ ఒకరు ఉండగా, ఒకే కులంలో వివాహం చేసుకున్న వారు విభిన్న ప్రతిభావంతులు 11 , మైనార్టీలు 13 , వెనుకబడిన కులాలకు చెందిన 278 మందికి , ఎస్సీ లు 178 మంది, ఎస్టీ లు ఇద్దరు కూ ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాలోనే, అదే కులంలో వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని జగనన్న ప్రభుత్వం చేస్తుందని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోఅర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా” క్రింద రూ. 87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు. కనీస విద్యా అర్హత 10 వ తరగతి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, బడుగు బలహీనర్గాలకు చెందిన వారు తప్పనిసరిగా చదువుకోవడానికి సానుకూలత వ్యక్తం చేస్తారని అన్నారు.

జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ ఎస్.సి ,  ఎస్.టి  , మైనారిటీ  జంటలకు ఒక లక్ష  రూపాయల చొప్పున, కులాంతర వివాహాలు చేసుకున్న ఎస్.సి, ఎస్.టి లకు లక్షా 20 వేల చొప్పున, బి.సి లకు 50 వేలు,  బిసి కులాంతర వివాహం చేసుకున్న వారికి 75 వేలు, వికలాంగులకు లక్ష 50 వేలు, రిజిస్టర్ అయిన భవన కార్మికులకు 40 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆడ పిల్లల తల్లుల ఖాతాలకు, తల్లులు లేని యెడల ఆడపిల్లల ఖాతాలకు  నగదును నేరుగా జమ చేస్తోందన్నారు.

కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్డిఏ పిడి ఎస్.సుభాషిని, ఏపీఎం మాలతి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *