-ఒక యూనిట్ రక్తం ఒక కుటుంబాన్ని కాపాడుతుంది…
-సమాజంలో రక్తదానం పట్ల అపోహలు తొలగిపోవాలి…
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నవారు తమ రక్తం ద్వారా మరొక కుటుంబాన్ని నిలబెడుతున్నామనే సంతృప్తితో ఆనందంగా రక్తదానానికి ముందుకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు అన్నారు.అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు ధర్మల్ విద్యుత్ కేంద్రంలో బుధవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లెడ్ సెంటర్ ఏర్పాటు చేసిన స్వచ్చంద రక్తదాన శిభిరాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందించి రక్తదాతలు ప్రాణదాతలు అవుతున్నారన్నారు. అనేక ప్రమాద సందర్భాల్లో, ఆపరేషన్ సమయంలో రక్తాన్ని దానం చేసి ఎంతోమంది ప్రాణాలు నిలుపుతున్న రక్త దాతలు అభినందనీయులన్నారు. అటువంటి రక్తదాతలకు ఒక రోజు కేటాయించి రక్తదాతల దినోత్సవం నిర్వహించుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు. తక్షణమే బ్లడ్ కావాలని అనేక పర్యాయములు తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని రక్తదాతలు ముందుకు రావడం వలన శ్రీకాకుళం, విశాఖపట్నం లలో సకాలంలో రక్తాన్ని అందించడం జరిగిందన్నరు. రానున్న వర్షాకాలం సీజన్లో బ్లడ్ బ్యాంకు కు బ్లడ్ అవసరం ఎక్కువగా ఉంటుందని కష్టతరంగా లభించే ఏబి నెగిటివ్ వంటి బ్లడ్ ను ముందస్తుగా జాగ్రత్త పరుచుకోవాలి అన్నారు. చాలా సందర్భాలలో సరైన సమయంలో రోగికి తగిన గ్రూపు రక్తం లభించక ఎంతోమంది కుటుంబంలో ఉన్న పెద్దదిక్కును కోల్పోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. తాము ఎవరికి రక్తం ఇస్తున్నామో తెలియకపోయినా సమాజం పట్ల బాధ్యతతో రక్తదానం చేస్తున్న రక్తదాతల వ్యక్తిత్వం ఎంతో మెచ్చుకోదగ్గరన్నారు. రక్తదానం చేసేవారు ప్రాణం దానం చేస్తున్నట్లేనన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా రక్తదానం చేయాలనే సంకల్పం కలిగిందన్నారు. కొన్ని సందర్భాలలో కొన్ని గ్రూపుల రక్తం ఎంత డబ్బు ఖర్చు చేసినా లభించదన్నారు. అటువంటి సందర్భాలలో స్వచ్ఛంద రక్తదానం చేస్తున్న మీలాంటి వారి రక్తదానంతో పునరుజ్జీవనం పొందిన వ్యక్తులు తమ జీవితాంతం రక్త దాతలను గుర్తుపెట్టుకుంటారన్నారు. రక్తదానం పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలపై ఉందన్నారు. ఇటీవల కాలంలో రక్తదానం పట్ల యువతరం ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించని రోజుల్లో స్వచ్ఛంద రక్తదానం అంటే సమాజంలో ఎవరికీ తెలిసేది కాదన్నారు. కానీ గత రెండు దశాబ్దాల్లో స్వచ్ఛంద రక్త దాతల సంఖ్య దశలవారీగా పెరుగుతోందన్నారు. స్వచ్ఛంద రక్తదాతలు చేస్తున్న ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో మరికొందరు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. చాలామంది రక్తానికి విలువ కడుతుంటారని, నిజానికి రక్తం విలువ అమూల్యమన్నారు. కొన్ని సందర్భాలలో అసాధారణ గ్రూప్ రక్తం ఎక్కడా లభ్యం కాని సమయంలో స్వచ్ఛంద రక్తదాతలే ముందుకు వచ్చి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. అటువంటి అసాధారణ రక్తం గ్రూపు ఉన్న స్వచ్ఛంద రక్తదాతలను ప్రశంసించారు. అసాధారణ గ్రూప్ రక్తం కలిగిన వారితో కూడా ఒక వాట్సాప్ సమూహాన్ని నిర్వహించాలని సూచించారు. కరోనా సమయంలో ఎంతోమందికి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, ప్లాస్మా అవసరం పెరగటం వంటి సందర్భాలలో స్వచ్ఛంద రక్తదాతలు అందించిన సేవలు కొన్ని వేల కుటుంబాలను కాపాడాయన్నారు. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్వచ్ఛంద రక్తదానం చేసేవారు తక్కువగానే ఉంటారన్నారు. జూన్ నెల నుంచి కళాశాలలో తిరిగి ప్రారంభం కావడం వల్ల రక్తదాతల సంఖ్య పెరుగుతుందన్నారు. ఇటువంటి కీలక సమయంలో రక్త దాతలు దానం చేసే రక్తానికి వెలకట్టలేమన్నారు. తాము చేసిన రక్తదానం వల్ల ఒక కుటుంబం నిలబడుతుందనే సంతృప్తి రక్తదాతకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. తోటి వారి ప్రాణం కాపాడేందుకు స్వచ్ఛంద రక్తదానం సంస్థలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ అభినందనీయమని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.కార్యక్రమంలో డియంహెచ్‌వో డా. యం సుహాసిని, ఎన్‌టిటిపిఎస్ ఛీఫ్ ఇంజనీయర్ పి నవీన్ గౌతమ్, డిఎస్‌పి మేహర్‌బాబు, ఏడి యంఎస్‌హెచ్‌్‌వో డా.ఉషారాణి, మెడికల్ ఆఫీసర్లు డా. రంజిత్, హెచ్‌ఆర్ మేనేజర్ ఎంఎస్ సుశీల తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News