రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బంగారుకొండ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహర అందచేసే పిల్లల ఇళ్లను ప్రతి బుధవారం సందర్శించి పర్యవేక్షణ చేస్తున్నట్లు బాలమిత్ర, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఇన్నిస్ పేట – వాక అప్పలస్వామి వీధిలో నివాసం ఉంటున్న జీ. నాగభూషణం ఇంటిని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ, పౌష్టికాహార లోపం గల పిల్లలను గుర్తించి వారిని సాధారణ స్థితికి తీసుకుని రావడానికి ఇది ఒక చక్కటి అవకాశం అని పేర్కొన్నారు. పిల్లవాని ఇంటికి వెళ్లి తల్లి పద్మకు బంగారుకొండ కిట్ ద్వారా జరిగిన ప్రయోజనం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత వారం 9.8 కేజీల బరువు ఉన్న నాగభూషణం 200 గ్రాములు పెరిగి 10 కేజీలకు బరువు చేరడం జరిగిందని జేసీ అన్నారు. ఇదే క్రమంలో బంగారుకొండ కిట్ పిల్లలకు మాత్రమే ఇవ్వాలని, తద్వారా మెరుగైన పెరుగుదల సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. బాలమిత్రాలు ఖచ్చితంగా ప్రతి బుధవారం వొచ్చి పిల్ల వానిలో జరుగుతున్న మార్పులు గమనించడం జరుగుతుందని జేసీ తెలియచేశారు. ఈ బంగారు కొండ కిట్ ద్వారా అందించే ఆహారం ప్రభుత్వం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పదార్థాలకు అందనం గా ఇస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల పాటు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పిల్లల సప్లిమెంటరీ లోపాన్ని అధిగమించి సరైన ఎదుగుదల, మానసిక వికాసం సాధ్యం అవుతుందని తెలియచేశారు. జాయింట్ కలెక్టర్ వెంట ఐ సి డి ఎస్ అధికారి సిహెచ్ వి. నరసమ్మ, సూపర్వైజర్ బి. వరలక్ష్మి, బాబు తల్లితండ్రులు ఉన్నారు.
Prajavartha Online Telugu News