-మధుమేహ వ్యాధి నియంత్రణకు వీజీఆర్ చేసిన కృషిని గుర్తించిన నాటా
-అభినందించిన పలువురు వైద్య ప్రముఖులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల అమెరికాలోని డల్లాస్ నగరంలో అత్యంత వైభవంగా జరిగిన నాటా-2023 వేడుకల్లో విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి(వీజీఆర్)కు అరుదైన నాటా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా గురువారంనాడు మొగల్రాజపురంలోని డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ హాస్పటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వీజీఆర్ మాట్లాడుతూ, గడచిన 17సంవత్సరాలకుపైగా మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకొస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 10లక్షల మంది పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా వ్యాస రచన పోటీలు నిర్వహించడం ద్వారా మధుమేహ వ్యాధిపై పూర్తి అవగాహన కల్పించామని చెప్పారు. నవంబరు 14 వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి 4వేలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులను ఇప్పటికీ కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. వ్యాధి నియంత్రణ కోసం తెలుగు, ఇంగ్లీషు భాషల్లో డాక్టర్ వీజీఆర్ డయాబెటీస్ అట్లాస్ పేరిట ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించినందుకు డాక్టర్ వీజీఆర్‌ను తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించి వాటికి ముందు మాటను కూడా రాయడం జరిగిందని చెప్పారు. వీజీఆర్ ట్రస్టు నుంచి ఇప్పటివరకు దాదాపు 8లక్షల పుస్తకాలను వివిధ వర్గాల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశామని పేర్కొన్నారు. నాటా వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నడుమ నాటా పురస్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణ కోసం డాక్టర్ వీజీఆర్ చేసిన సేవలకు గాను నాటా పురస్కారాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే పర్యావరణంపై ఉన్న మక్కువతో దాదాపు 40వేల మొక్కలను కడియం నర్సరీ నుంచి తీసుకువచ్చి 25గ్రామాల ప్రజలకు, హాస్పటల్‌కి వచ్చే రోగులకు ఉచితంగా అందజేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబరు 14న వరల్డ్ బయాబెటిస్ సందర్భంగా వీజీఆర్ డయాబెటిస్ అట్లాస్ బుక్‌ను హిందీ భాషలో ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నాటా పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా నగరానికి చెందిన పలువురు వైద్య ప్రముఖులు డాక్టర్ వీజీఆర్‌కు అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News