– ఎస్ఎస్ఆర్-2024, ఎన్నికల సన్నద్ధత సదస్సుకు ఢిల్లీ నుంచి ఈసీఐ ప్రతినిధుల బృందం
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై ఈ నెల 22వ తేదీ శుక్రవారం నుంచి రెండురోజుల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో సమీక్ష సమావేశం జరగనుందని.. ఇందుకు సంబంధించి నోవాటెల్‌లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత కార్యకలాపాలపై రెండు రోజులపాటు జరగనున్న సదస్సుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కలెక్టర్ డిల్లీరావు గురువారం నోవాటెల్ హోటల్‌ను సందర్శించి.. ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు సహా మొత్తం ఏడుగురు ప్రతినిధుల బృందం న్యూఢిల్లీ నుంచి రానున్న నేపథ్యంలో సమీక్షా సమావేశాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులకు మార్గదర్శకాలిచ్చారు. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు ఎస్ఎస్ఆర్-2024 కార్యకలాపాలు, ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సీటింగ్, అడ్రెసింగ్ సిస్టమ్, భద్రత, భోజన, వసతి తదితరాలకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు వెల్లడించారు. ఏర్పాట్ల పరిశీలనలో జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News