అభ్యుదయ, లౌకిక భావజాల వ్యాప్తికి కృషి

-ప్రవాసాంధ్రులకు రామకృష్ణ పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభ్యుదయ, లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష భావజాల వ్యాప్తికి ప్రవాసాంధ్రులు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు. అమెరికాలోని డల్లాస్‌లో నివసించే ప్రవాసాంధ్రుడు, సాహితీవేత్త లెనిన్‌ వేముల స్వదేశానికి వచ్చిన సందర్భంగా గురువారం ఇక్కడి సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరినాగభూషణరావు భవన్‌లో సీపీఐ రాష్ట్ర నాయకత్వాన్ని కలిశారు. ఈ సందర్భంగా జరిగిన ఇష్టాగోష్టి సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ, తానా మహాసభలకు తాను అమెరికా వెళ్లిన సందర్భంగా లెనిన్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. భారత సంస్కృతీ సంప్రదాయాలకు, తెలుగు సాహిత్య సౌరభాలకు అమెరికాలో లెనిన్‌ వేముల విస్తృత ప్రచారం చేస్తున్నారని కొనియాడారు. ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మాతృభూమిని మరిచిపోకుండా సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. అభ్యుదయ, లౌకిక, వామపక్ష భావాల వ్యాప్తికి, అమెరికాలోని తెలుగువారిని సంఘటితం చేయడానికి మరింత కృషి చేయాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతానికి చెందిన లెనిన్‌ వేముల చిన్నతనం నుంచి వామపక్ష భావజాలాన్ని అలవర్చుకున్నారనీ, ఎప్పుడో అమెరికాలో స్థిరపడిన సాహితీవేత్తగా, అభ్యుదయవాదిగా అక్కడి తెలుగువారిని కూడగట్టి చైతన్యపరచడంలో విశేష కృషి చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మికసంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య, కమ్యూనిజం మాసపత్రిక సంపాదకులు చలసాని వెంకటరామారావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు, సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, విజయవాడ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, ప్రోగ్రసీవ్‌ ఫోరం నాయకులు అక్కినేని చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. లెనిన్‌ వేముల మాట్లాడుతూ, అమెరికాలోని తెలుగు వారిని, ప్రత్యేకించి లౌకిక, వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య భావజాల వ్యాప్తికి మరింత కృషి చేయనున్నట్టు చెప్పారు. తెలుగు భాషా వికాసానికి తన వంతు సహకారమందిస్తామని చెప్పారు. ఈ రోజు ఇంతమంది లౌకిక భావాలు కలిగిన వారితో సమావేశం కావడం సంతోషకరంగా ఉందని చెప్పారు. తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జల్లి విల్సన్‌, ఓబులేసు, వనజ, మోదుమూడి రామారావు తదితరులు లెనిన్‌ వేములను శాలువా, బొకెలతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర పుస్తకాలను మనోహర్‌నాయుడు, సంపాదక చక్రవర్తి సి. రాఘవాచారి సంపాదకీయాల సంపుటాలను అక్కినేని చంద్రరావు లెనిన్‌ వేములకు అందజేశారు. సీపీఐ కృష్ణాజిల్లా నాయకులు మోదుమూడి రామారావు తొలుత లెనిన్‌ వేముల జీవన నేపథ్యం, అమెరికాలో ఆయన చేస్తున్న కృషిని వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *