విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైసిపి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మోసాలకు అక్రమాలకు వేదికగా మారిపోయిందని, తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసే హక్కు భక్తులకు లేకుండా పోయిందని గతంలో వున్న యాజమాన్యం ఈ.ఓ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రకముల అవినీతి, అక్రమాలపై ప్రభుత్వము వెంటనే సిబిసిఐడి విచారణ గాని మాజీ న్యాయమూర్తితో న్యాయవిచారణ జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుమలలో తాను వెంకటేశ్వరస్వామి భక్తుడనని నా ప్రాణాలు కాపాడిన వెంకన్న పేరుతో గతంలో జరిగిన మోసాలను అన్నింటిపై చర్యలు తీసుకుంటానని చెప్పటం చాలా సంతోషదాయకమైన విషయమన్నారు. టిటిడి ఎన్నో కుంభకోణాలకు, మోసాలకు నిలువుదోపిడీలకు అడ్డాగా మారిపోయిందని దర్శనాలు కొన్ని ఆన్‌లైన్ జరుగుతున్నా అవినీతి మార్గములో క్యాష్ లైన్‌లోనే జరిగాయని, టి.టి.డి అధికారుల అండదండలతో ఎక్కువ మొత్తానికి విక్రయించడం జరిగిందన్నారు. తిరుమలలో మధ్యం, సిగరెట్లు, గంజాయి లాంటి పదార్థాలు ప్రస్తుతం విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, అదే విధంగా టిటిడి విజిలెన్స్ అధికారులు అక్రమ ఆర్జనలకు కొమ్ముకాసి కొండపైన చిరు వ్యాపారులకు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ అవినీతికి నిలయంగా తిరుమలను తయారు చేశారన్నారు. ఇంజనీరింగ్‌లో గతంలో ప్రతి ఏటా 150 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఇటీవల ఏకంగా 1,500 కోట్లకు పెంచారని ఎవరి అనుమతితో ఆమోద ముద్ర వేశారో విచారణ జరపాలన్నారు. గోవిందరాజ స్వామి సత్రాలను ఆగమేఘాల మీద కూల్చి వేసి.. పునర్నిర్మాణం పేరుతో.. కమీషన్ల కోసం ఒక్కసారిగా రూ.600 కోట్లు కేటాయించడం దుర్మార్గమన్నారు. స్విమ్స్ హాస్పిటల్‌లో రెనోవేషన్, మెయింటెనెన్స్ పేరుతో సుమారు 200 కోట్ల రూపాయలను కేటాయించిన పనులపై దృష్టి సారిస్తే నమ్మలేని నిజాలు భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వస్తాయని, అవినీతి అక్రమాలు వెలుగులోనికి వస్తాయని అందుకు ముఖ్యమంత్రి వెంటనే స్పందించి న్యాయ విచారణకు చర్యలు చేపట్టాలని కోరారు. వక్తలు మాట్లాడుతూ సంఫీుభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చేవూరి శ్రీధర్‌రెడ్డి, బీసీ సంఘం (చేనేత) నాయకుడు చంద్రశేఖర్, వేముల రవి, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News