మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని 100 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పోషకాహార పెరటి తోటలను పెంచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరంలోని సన్ స్టార్ పాఠశాలలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం జిల్లా విద్యాశాఖ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 100 పాఠశాలల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పోషకాహార పెరటి తోటల పెంపక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాను రాను కాలుష్యం ఎక్కువ అవుతుందని, క్రిమిసంహారక మందులు వాడకము ఎక్కువ అవుతుందని, పండించే రైతుకు ఖర్చు ఎక్కువై ఆదాయం తగ్గిపోతుందని, ఇటు వినియోగదారులు డబ్బు పెట్టిన ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. భూమికి కాంప్లెక్స్ ఎరువులు క్రిమిసంహారక మందులు వేయడం వలన రాను రాను భూమి సామర్థ్యం కోల్పోతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం వైపు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహారాష్ట్రలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ ఉద్దేశంతోనే ప్రకృతి వ్యవసాయంపై చిన్నతనం నుండి పిల్లలకు తెలియజేయాలనే సత్సంకల్పంతో పాఠశాల స్థాయి నుండి పెరటి తోటల పెంపక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
పిల్లలకు తెలియజేయడం ద్వారా వారు స్వగ్రామాలకు వెళ్లినప్పుడు వారి ద్వారా నిదానంగా గ్రామాల్లో మార్పు రావడం జరుగుతుందన్నారు. తొలి దశలో రైతు సాధికార సంస్థలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉన్న పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. చిన్నతనం నుండి పిల్లలకు విత్తన శుద్ధి, ఘన, ద్రవ, బీజామృతాలు అంటే ఏమిటి వాటి వలన మొక్కలు ఎంత బాగా పెరుగుతాయి అనే విషయం పైన వారికి అవగాహన కలిగించాలన్నారు. ఎంఈఓ లు ప్రధానోపాధ్యాయులు పి.ఈ.టిలు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఒక బృందంగా పనిచేసి ప్రతి స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పాఠశాలలో ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులను మినహాయించి మిగిలిన విద్యార్థులకు ఈ కార్యక్రమం పైన సంపూర్ణ అవగాహన కలిగించాలన్నారు. తద్వారా మాతృభూమికి గౌరవ వందనం చేసినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని బరువుగా భావించక, ఇదొక మంచి అవకాశంగా, బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. వ్యవసాయ శాఖ ఏడి పార్థసారథి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు.
తదుపరి మోపిదేవి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయంతి తాను ప్రకృతి వ్యవసాయం ద్వారా పాఠశాలలో పెరటి తోటలను పెంచుతున్నట్లు జిల్లా కలెక్టర్కు వివరించడంతో జిల్లా కలెక్టర్ ఆమెను అభినందిస్తూ ఆమె అనుభవాలను అందరికీ తెలియజేయాలని సూచించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం సన్ స్టార్ పాఠశాలకు చెందిన 5 వ తరగతి విద్యార్థులు వై. అభినవ్, ప్రీతం గణితంలోనూ, క్యూబ్స్ లోనూ ప్రతిభ కనబరచడంతో జిల్లా కలెక్టర్ వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి తహేరా సుల్తానా జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరరావు నాయక్, జిల్లా సైన్స్ అధికారి మొహమ్మద్ జాకీర్ అహ్మద్, కేవికే కోఆర్డినేటర్ శ్రీలత, సన్ స్టార్ పాఠశాల కరస్పాండెంట్ శ్రీరామ్, ప్రధానోపాధ్యాయులు రవికాంత్, పలువురు మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News