విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఖాతాదారుల ఆధారాభిమానాలు పొందడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన బ్యాంకు అధికారులకు సూచించారు. నగరంలోని విద్యాధరపురం, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంకు బ్రాంచిని బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి సృజన జాయింట్ కలెక్టర్ పి. సంపత్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన జిల్లాలో 73 బ్రాంచ్ లు, విజయవాడ నగరంలో 40 బ్రాంచ్ శాఖల ద్వారా ఖాతాదారులకు సేవలను అందిస్తుందన్నారు. ఖాతాదారులకు నమ్మకం కలిగిస్తూ స్నేహపూర్వకమైన వాతావరణంలో సేవలందించిన్నపుడే బ్యాంకింగ్ రంగంలో పోటీతత్వాన్ని ఎదుర్కోగలుగుతామన్నారు. ఖాతాదారులకు నమ్మకమైన సేవలందించినప్పుడే వారు బ్యాంకులకు చేరువ అవుతారన్నారు. విజయవాడ నగరం వ్యాపార రంగానికి కీలమైనదన్నారు. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఉన్నాయని అన్నారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, రైతులకు అవసరమైన పంట రుణాలను సకాలంలో అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు రుణాలు అందించడంలోను, ముద్ర రుణాలను మంజూరు చేయడంలో బ్యాంక్ అధికారులు ముందుకు రావాలన్నారు. ఔత్సాహికవంతులైన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి రుణాలను మంజూరు చేసిన్నట్లయితే వ్యాపారాన్ని మరింత విస్తృత పరిచి ఖాతాదారుల మన్ననలను పొందగలుగుతారని కలెక్టర్ సృజన అన్నారు.
జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చెయ్యాలని, డిపాజిట్ల కోసం జన్ ధన్ ఖాతాలని మరింత పెంపొందించు కావాలని కోరారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ భాస్కర రావు మాట్లాడుతూ సమాజంలోని బడుగు వర్గాల ఆర్థిక అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. తమ బ్యాంకు ద్వారా వ్యవసాయ దారులకు పారిశ్రామిక వేత్తలతో పాటు విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారుల అభిమానాన్ని పొందడమే ప్రధాన ఎజెండాగా తమ బ్యాంకు అధికారులు సేవలందిస్తారన్నారు. స్వయం సహాయ సంఘాలకు గృహా నిర్మాణాల లబ్దిదారులకు, వ్యవసాయ, విద్య రుణాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో విద్యాధర పురానికి చెందిన నాగ సునీతకు ఏడు లక్షల కార్ లోన్ అందజేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జోనల్ హెడ్ సీవీయన్ భాస్కర రావు, రీజనల్ హెడ్ మువ్వల శ్రీధర్, డిప్యూటీ రీజనల్ హెడ్స్ హరీష్ బేతా, ఐఎస్ఎస్ మూర్తి, ఇతర బ్యాంక్ అధికారులు, సిబ్బంది మరియు ఖాతాదారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News