తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ (బయో) ద్వారా జిల్లాలోని వివిధ పిహెచ్ సిల పరిధిలో నిర్వహిస్తున్న పింక్ బస్ క్యాంపుల్లో మహిళలు, పురుషులు వారి గ్రామ వార్డులకు షెడ్యూల్ మేరకు వచ్చినప్పుడు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత ఎంఎల్హెచ్పీలు ప్రజలకు అవగాహన కల్పించి క్యాంపుకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కోరారు.
సోమవారం మధ్యాహ్నం తిరుపతిలోని కలెక్టర్ ఛాంబర్ నందు స్విమ్స్ బయో ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.జయచంద్రారెడ్డి తదితర అధికారులతో కలెక్టర్ క్యాన్సర్ స్క్రీనింగ్ పై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ క్యాన్సర్ ను వీలైనంత త్వరగా గుర్తిస్తే తగిన వైద్యం అందించి పూర్తిగా నివారించవచ్చని, పింక్ బస్ షెడ్యూల్ తేదీలను, వెన్యూ వివరాలపై సంబంధిత ఎంఎల్ హెచ్ పీ లు ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోందని చెప్పారు. త్వరలోనే ఎం ఎల్ హెచ్ పీ లకు ఒక శిక్షణ కార్యక్రమం త్వరలోనే నిర్వహించనున్నామని, నిర్ణీత నియమావళి ప్రకారం సర్వే నిర్వహించి మహిళలను, పురుషులను పింక్ బస్సు క్యాంపుల వద్దకు వారు తీసుకురావాలని తెలిపారు.
పీహెచ్సి ల పరిధిలో మెడికల్ ఆఫీసర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారిని చికిత్స కోసం స్విమ్స్ ఆంకాలజీ విభాగానికి తప్పకుండా వచ్చేలా సంబందిత పిహెచ్సి డాక్టర్, ఎం ఎల్ హెచ్ పీ చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలాజీ నూతన భవన నిర్మాణ వివరాలను స్పెషల్ ఆఫీసర్ అంకాలజి వారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.లలిత్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News