-బాలికల , విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిని ఉపేక్షించం
-అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు సిఫార్సు
-తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం / నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు పాల్పడడం , బాలికల లైంగిక వేధింపులు, అసభ్యంగా ప్రవర్తించడం మరియు అమాయక బాలికలపై అనైతిక మరియు అసభ్యకరమైన చర్యలను కొనసాగించడం పై విచారణ అనంతరం నిడదవోలు మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ , కాటాకోటేశ్వరం స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) డి.నాగమణిరాజు ను విధులను సస్పెండ్ చేస్తూ జిల్లా పాఠశాల విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మహిళల పట్ల , బాలికల పట్ల అనైతికంగా ప్రవర్తించే వారి విషయంలో ఉపేక్షించే ప్రసక్తేలేదని, అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసులను నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరించారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారిణి ఆధ్వర్యంలో ఆగష్టు 13 న నిడదవోలు మండలం, జిల్లా పరిషత్ హై స్కూల్ , కాటా కోటేశ్వరం స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) డి.నాగమణిరాజు ప్రవర్తనపై సమగ్ర విచారణ చేపట్టడం జరిగిందన్నారు. విచారణ సందర్భంలో బాలికల పై , విద్యార్థుల సమక్షంలో వేధింపు ఘటనలు, అసభ్య పదజాలం ప్రయోగించడం నిజమని ప్రాథమిక విచారణలో భాగంగా గుర్తించడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా తూర్పు గోదావరి జిల్లా పాఠశాల విద్యాధికారి సమగ్ర నివేదికను పరిశీలించి సదరు ఉపాధ్యాయుడిని తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆగష్టు 19 న ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.
మహిళల , బాలికల భద్రత పట్ల అంకితభావం కలిగి ఉండాలని , ఉపాధ్యాయ వృత్తికి మరింత గౌరవం తెచ్చే విధంగా ప్రవర్తన ఉండాలని పేర్కొన్నారు. పిల్లల మనోభావాలను కించ పరిచే విధంగా ఎవ్వరూ ప్రవర్తించారాదని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. అటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై శాఖ పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్, అట్రాసిటీ కేసులు నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
Prajavartha Online Telugu News