మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి నాటికి రోడ్ల గుంతలన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 3 కోట్ల రూపాయలతో రేపు జిల్లా ఇన్చార్జి మంత్రి, పార్లమెంటు సభ్యులు, కూటమి నాయకులతో కలసి గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆదివారం మంత్రి కూటమి నాయకులతో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లో జవాబుదారీ, పారదర్శక అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తున్నా మన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా నెలకు 4 వేల రూపాయల చొప్పున ప్రతి నెల ఒకటవ తేదీన రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లను ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని దీపావళి నుంచి శ్రీకారం చుట్టామన్నారు. గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టామని, ఐదేళ్లలో ఒక్క గుంతను కూడా గత ప్రభుత్వం పూడ్చలేదని, గుంతలు పూడ్చడానికి రూ.360 కోట్లు మంజూరు చేసి, ఇప్పటికే గుంతలు పూడ్చే పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను కూడా సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు.
మచిలీపట్నం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తెస్తున్నామని, రు.30 కోట్లు ఉపాధి హామీ నిధులతో రెండేళ్లలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, మచిలీపట్నం నియోజకవర్గంలో రోడ్ల మరమ్మత్తులకు 30 కోట్లు వచ్చాయి, 15వ ఆర్థిక సంఘం కింద మంజూరైన రూ.5కోట్లతో మున్సిపాల్టీలో డ్రైన్లు, పార్కుల అభివృద్ధి చేయనున్నాం, డిస్ట్రిక్ మైనింగ్ ఫండ్ కింద మరో రు.30 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్ షిప్ (PPP) కింద చారిత్రక కోనేరుసెంటర్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2025 నాటికి పూర్తయ్యేలా బందరు పోర్టు పనులు జరుగుతున్నాయన్నారు. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులను టైమ్ లైన్ పెట్టుకుని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, బండి రామకృష్ణ, గొర్రెపాటి గోపీచంద్, లంకె నారాయణ ప్రసాద్, ఇలియాస్ పాషా, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News