-వ్యాధి మానవులకు వచ్చే ప్రమాదం ఉంది…
-సరిహద్దు జిల్లాల నుండి వచ్చే కోళ్లు, మాంసం, గుడ్ల పై గట్టి నిఘా ఉంచండి…
-అన్ని చెక్ పోస్ట్ ల వద్ద కోళ్లు, గుడ్ల రవాణా వాహనాల తనిఖీలు నిర్వహించండి…
-గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలో అనుమానిత చికెన్ షాపులలో తనిఖీలు నిర్వహించండి…
-ఫ్లూ లక్షణాలు ఉన్నవారి శాంపిల్స్ సేకరించి ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచన….
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బర్డ్స్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, వ్యాధి జిల్లాలో ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సరిహద్దు జిల్లాలలో బర్డ్స్ ఫ్లూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లాలో ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక, రవాణా, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో మంగళవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వ్యాధి వైరస్ వల్ల వస్తుంద ని తొలుత కోళ్ల కు, అనంతరం మనుషులకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల ఉభయ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో బర్డ్ ఫ్లూ వ్యాధి శాంపిల్స్ నిర్ధారణలో పాజిటివ్ లక్షణాలు వచ్చాయని తక్షణమే ఆయా జిల్లాల యంత్రాంగం అన్ని రక్షణ చర్యలు తీసుకుందన్నారు. ఇతర జిల్లాల నుండి వాహనాల రాకపోకలు లేకుండా చేశారన్నారు. పది కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ చేశారన్నారు .మన పొరుగు జిల్లా లలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఉంది కాబట్టి ఆ జిల్లాల నుండి కోళ్ళు, గుడ్లు రాకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు. వ్యాపారస్తులు కూడా తక్కువ ధరకు పక్క జిల్లాలల నుండి తీసుకువచ్చి అమ్మకాలు నిర్వహిస్తారని, ఆ జిల్లాల నుండీ వచ్చే గుడ్లు, కోళ్లు, మాంసం ఉత్పత్తులను పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న కోళ్ల కి ఎటువంటి ఇబ్బందిలేదని, అయితే వాటిని ఎక్కువ బాయిల్ చేసి తినడం మంచిదన్నారు. ఇతర జిల్లాల నుండి వాటిని మన జిల్లాలోకి రాకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు. జిల్లాలోని పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది జిల్లాలోని అన్ని కోళ్ల ఫామ్స్ లను పరిశీలించి అక్కడ శానిటేషన్ , తీసుకుంటున్న రక్షణ చర్యలు, వ్యాక్సినేషన్ ను పరిశీలిస్తున్నారన్నారు. జిల్లాలోని అన్ని కోళ్లకు వాక్సినేషన్ చేసి ప్రొటెక్షన్ లోనే ఉంచామన్నారు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ వైరస్ లోడ్ అయితే ఇబ్బంది ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఇతర జిల్లాల నుండి రాకుండా చూడాలన్నారు. ఇందుకు రాపిడ్ రెస్పాన్స్ టీమ్ లవలె సర్వేలెన్స్ టీమ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలంలో రెండు నుండి మూడు టీములు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచామని,ఎక్కడైనా కోళ్లు చనిపోయి నట్లయితే ఆ రైతులను అప్రమత్తం చేస్తున్నామన్నారు.
అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల చెక్ పోస్ట్ ల వద్ద పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బందిని విధుల్లో ఉంచడం జరిగిందన్నారు. ఇతర జిల్లా నుండి వచ్చే వాటిని పరిశీలించి చెక్ చేసి ఇబ్బంది లేకపోతే వాటిని జిల్లాలో అనుమతిస్తున్నామన్నారు.
పశుసంవర్ధక, పోలీస్, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో అన్ని చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా ఉంచామని అనుమానం ఉండి సమాచారం అందిస్తే అరగంట లోపే పశుసంవర్ధక శాఖ అధికారులు అక్కడకు వచ్చి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చికెన్ షాపుల వారు ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారే దానిని పరిశీలించాలన్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారులు వారి పరిధిలోని చికెన్ షాపులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి అక్కడి శానిటేషన్ ప్రక్రియను పరిశీలించి రక్షణ చర్యలు తీసుకోవడం వల్ల మన జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి రాకుండా అదుపులో ఉంచుకోవచ్చు నన్నారు.
వారం పది రోజుల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎందుకంటే వాతావరణంలో ఉష్ణోగ్రత స్థాయి పెరగడంతో వైరస్ చనిపోయే అవకాశం ఉందని అన్నారు . మనుషులకు కూడా వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ చికెన్, గుడ్లను బాగా ఉడికించి తీసుకోవాలని సూచించారు. హోటల్స్, రెస్టారెంట్ లో కూడా పూర్తిగా బాయిల్ చేసిన వాటిని తీసుకోవాలన్నారు. గ్రామాలలో ఫ్లూ లక్షణాలు ఎవరికైనా ఉంటే వారి శాంపిల్స్ తీసి పరీక్షించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, ఎక్కడైనా పక్షులు చనిపోతే వాటిని పూర్తిగా శానిటేషన్ చేయాలని, చనిపోయిన వాటి సమాచారాన్ని స్థానికంగా ఉండే పశు సంవర్ధక శాఖ అధికారులకు అందించాలని ఆదేశించారు.
బర్డ్స్ ఫ్లూ వ్యాధిని ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో వ్యాధి ప్రబలకుండా తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నరసింహులు వివరించారు.
Prajavartha Online Telugu News