-సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి…
-సైబర్ ఫిర్యాదుల కోసం 1930 కి కాల్ చేయండి.
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సైబర్ మోసాల పై యువత అవగాహనతో పాటు అప్రమత్తత అవసరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రపంచ సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ చాంబర్ లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైబర్ మోసాలపై ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల రెండవ మంగళవారం ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా .డిజిటల్ అరెస్ట్, కేవైసి & ఓ.టి.పి, నెట్ బ్యాంకింగ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ స్కామ్, లాటరి స్కామ్స్, క్రెడిట్ & డెబిట్ స్కామ్స్, ఫిషింగ్, ఫేక్ యాప్స్, లోన్ స్కామ్స్, వర్క్ ఫ్రం హోం స్కామ్స్, జాబ్ స్కామ్స్, యు.పి.ఐ. స్కామ్స్, లోన్ స్కామ్ వంటి వాటికి సంబంధించి ఎక్కువ సైబర్ మోసాలు జరుగుతుంటాయని తెలిపారు.
స్కైబర్ మోసాలకు సంబంధించి ఇంటర్నెట్ భద్రతా సూచనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని అన్నారు. ముఖ్యంగా
ఓటిపి (OTP). ఆధార్, పాన్ లేదా బ్యాంకు వివరాలను కాల్స్ ద్వారా ఎప్పుడూ వెల్లడించ కూడదన్నారు. అనధికారిక ఆధార్ చెల్లింపు నోటిఫికేషన్లపై జాగ్రత్త వహించాలని, కెవైసి (KYC) నవీకరణల పేరుతో పాన్, ఆధార్ లేదా బ్యాంకు వివరాలు అడిగే అనధికార సంఖ్యల నుంచి లింకులను ఎప్పుడూ క్లిక్ చేయరాదన్నారు.
వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు అడిగే అనధికార కాల్స్ కు ఎప్పుడూ స్పందించకూడదని తెలిపారు. పేమెంట్స్ స్వీకరించడానికి క్యూఆర్ (QR) కోడ్స్ స్కాన్ చేయడం లేదా ఓటిపి/ పిన్ (OTP/PIN) లను పంపడం చేయరాదని, ఇవి మోసగాళ్లు స్కామ్ కోసం ఉపయోగించుకుంటారని తెలిపారు.
టెలికాం శాఖ లేదా ట్రాయ్ (TRAI) నుండి వచ్చే వాయిస్ కాల్స్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అన్నారు. ఆన్ లైన్ లో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, డిజిటల్ ఐడెంటిటీ రక్షించుకోవాలని,అసలైన కొరియర్ సేవలు, బుక్ చేయని పార్సెల్ కోసం ఫీజు చెల్లించమని అడగడం, అధిక రాబడులు కలిగిన ఆన్ లైన్ పెట్టుబడుల ఆఫర్లను నమ్మవద్దున్నారు.
మీ మొబైల్లోని యాప్స్ క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలన్నారు. ఉపయోగం కాని యాప్స్ ను తక్షణమే తొలగించుకోవలన్నారు.
ఎటువంటి ప్రభుత్వ సంస్థలు (పోలీస్,సి.బి.ఐ, ఈడి) వీడియో లేదా వాయిస్ కాల్స్ ద్వారా ఎటువంటి దర్యాప్తు చర్యలు కానీ లేదా అరెస్టు కానీ చేయలేవని, సున్నితమైన లావాదేవీల కోసం పబ్లిక్ వైఫై ని ఉపయోగించుకోకూడదని తెలిపారు. సైబర్ ఫిర్యాదుల కోసం 1930 కి కాల్ చేయటం కాని లేదా (www.cybercrime. gov.in) ఉపయోగించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. అనంతరం సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేలా అవగాహన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు.
సమావేశంలో డిఆర్ఓ కె. చంద్రశేఖరరావు, ఎన్ఐసి ఏడిఐఓ సెల్వినా, సైబర్ క్రైమ్ సిఐ వెంకటేష్ ,కలెక్టరేట్ ఏవో, సెక్షన్ సూపరిండెంట్లు ,సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News