మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణాన్ని కాపాడుతూ పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ ప్రకటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ పై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ లో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని ఆతిథ్య సౌకర్యాలు కల్పిస్తున్న హోటల్స్, రెస్టారెంట్లు, హోమ్ స్టే లు, ధర్మశాలలు లాడ్జీలు లో ఆతిథ్య సౌకర్యాలకు రేటింగ్ ప్రకటించడం జరుగుతుందన్నారు. ఆతిథ్య రంగంలో పరిశుభ్రత( హైజినిక్) పాటిస్తూ పారిశుధ్యం కోసం మెరుగైన పద్ధతులను అవలంబించడం రేటింగ్ లో ప్రధానంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కల్పించిన సదుపాయాలను పరిశీలించి మార్కులు కేటాయిస్తారన్నారు. టాయిలెట్ సదుపాయాలు, వాటి నాణ్యతా ప్రమాణాలు, సురక్షిత పారిశుద్ధ్య సౌకర్యాలు, ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వాహణ, తడి పొడి చెత్త వేరు చేసే విధానం, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడక నిషేధం, ప్లాస్టిక్ వ్యర్ధాల వేరు చేయడం పరిశీలించి 100 నుండి 130 మార్కులకు ఒక లీఫ్, 130 నుండి180 మార్కులకు మూడు లీఫ్ లు, 180 నుండి 300 మార్కులకు 5లీఫ్ లు కేటాయింపులు జరుగుతాయన్నారు. వీటివల్ల ఆయా హోటల్స్ కు గుర్తింపు రావడంతో పాటు, వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఇంకనూ కల్పించాల్సిన సదుపాయాలపై అవగాహన కల్పించి వారు ఐదు లీఫ్ స్టార్ రేటింగ్ పొందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి స్వచ్ఛత గ్రీన్ లీఫ్ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా సౌకర్యాలను పరిశీలించి అక్టోబర్ రెండో తేదీలోగా నివేదిక అందించాలని కమిటీ చైర్మన్, కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.
సమావేశంలో కన్వీనర్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ నటరాజ్, మెంబర్ సెక్రటరీ, జిల్లా పర్యాటక శాఖ అధికారి జి. రామ లక్ష్మణరావు, కమిటీ సభ్యులు జెడ్పి సీఈవో కన్నమ్మ నాయుడు, డిపిఓ అరుణ, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ఉన్నారు.
Prajavartha Online Telugu News