మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వచ్చే మే నెల 10 వ తేదీన జాతీయ లోకదాలత్ ను విజయవంతంగా నిర్వహించి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కక్షిదారులు అందరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి గోపి కోరారు. గురువారం సాయంత్రం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలో గల న్యాయ సేవా సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ అధికారులు కక్షిదారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
రాజీమార్గమే రాజమార్గం అన్నారు. తాను విజయనగరం విశాఖపట్నంలో పనిచేసినప్పుడు లోక్ అదాలత్ ను ఎంతో అద్భుతంగా నిర్వహించామన్నారు. అదే తరహాలో కొత్త వరవడితో జిల్లాలో నిర్వహించి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు పోలీసు అధికారులు న్యాయవాదులు బీమా కంపెనీలు, విద్యుత్తు బిఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ శాఖలు అందరూ సహకరించాలన్నారు.
ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్ కమిటీలు ఏర్పాటు చేసుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ అధ్యక్షతన కోర్టు కేసులను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పర్యవేక్షించాలన్నారు.
ఆ విధంగా చేయడం వలన సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. ఇందుకోసం అందరూ సన్నద్ధం కావాలని సూచించారు.
లోక్ అదాలత్ ఒక రోజుతో ముగిసిపోయే ప్రక్రియకాదని క్రమం తప్పకుండా న్యాయవ్యవస్థతో పాటు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమాంతరమైన వ్యవస్థగా మారుతూ ఉందన్నారు.
లోక్ అదాలత్ సమయంలో వీలైనన్ని ఎక్కువ కోర్టు కేసులు పరిష్కారం అయ్యేందుకు న్యాయమూర్తులతో పాటు పోలీసులు న్యాయవాదులు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు.
న్యాయవాదులకు తెలిసే రాజీ జరగాలన్నారు.
అదనపు ఎస్పీ వివి నాయుడు మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి సూచించిన విధంగా జిల్లాలోని 2450 కేసులను పర్యవేక్షించి స్టేషన్ల వారీగా సర్కిల్ కమిటీలను ఏర్పాటు చేసి పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య, 6 వ, 9 వ జిల్లా అదనపు న్యాయమూర్తులు పాండురంగారెడ్డి, సుజాత, కే.ఆర్.ఆర్.సి. ఎస్.డి.సి శ్రీదేవి, మచిలీపట్నం డిఎస్పి సిహెచ్ రాజా తదితర అధికారులు న్యాయవాదులు, అనధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News