మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలవటంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా వైద్యసేవలు శాఖామంత్రి మరియు కృష్ణ జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్చార్జి మంత్రి గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇన్చార్జి మంత్రి వ్యవసాయం, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, జల వనరుల శాఖ, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ తదితర అంశాలపై సమీక్షించారు.
ముందుగా పెహల్గాం ఉగ్ర దాడిలో మృతి చెందిన వారికి సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ అధికారం చేపట్టిన 11 నెలల్లోనే కృష్ణాజిల్లా అన్ని రంగాల్లో, అన్ని శాఖల్లో ముందంజలో ఉందన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలవడం అభినందనీయం అన్నారు. అలాగే పదవ తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించడం హర్షనీయమన్నారు. వేసవి లో గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి సమస్య రాకుండా గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు పంటల బీమా పథకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కోరారు. అధికారులు, సిబ్బంది రైతులకు పంటల బీమా పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. వాతావరణం అనుకూలించకపోతే రైతుకు మిగిలేది పంట బీమా మాత్రమేనని వివరించారు. పశు బీమా క్లైములు 95 శాతం పరిష్కరించటంపై హర్షం వ్యక్తం చేశారు. చెరువుల్లోని సిల్ట్ డ్రెయిన్లలోకి వదులుతున్నారని దీంతో పలు సమస్యలు వస్తున్నాయన్నారు. చెరువుల యాజమాన్యాల అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి మరోసారి ఇటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యశాఖ అధికారులు స్థానిక శాసనసభ్యులకు తెలియపరచకుండా గ్రామ సభలు నిర్వహించటం మంచి పద్ధతి కాదని, ప్రోటోకాల్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అభివృద్ధిలో నెంబర్ వన్ గా కృష్ణ జిల్లా నిలవటంపై మరోసారి అభినందనలు తెలిపారు.
రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గ్రామం, నియోజకవర్గం, జిల్లా లవారీగా అభివృద్ధి పథంలో పయనింపచేస్తూ, GSDP పెరిగే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల కాలంలోనే GSDP 12 శాతం కు ముఖ్యమంత్రి తీసుకురాగలిగారన్నారు. ఇదేవిధంగా GSDP 15 శాతానికి చేరుకుంటే దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుంది అన్నారు. అదేవిధంగా మన జిల్లాలో కూడా అభివృద్ధి జరగాలంటే వ్యవసాయం, హార్టికల్చర్, మత్స్యశాఖ ఇలా ప్రతి శాఖ సమగ్ర అభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. అప్పుడే సంపూర్ణ ఫలితాలు సాధించగలం అన్నారు. మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేదరికం లేని సమాజం కోసం P4 విధానం ద్వారా బంగారు కుటుంబాలను గుర్తించటం ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అందించే ఆర్థిక భరోసా ఈనెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విడుదల చేయటం జరుగుతుందన్నారు. కృష్ణా జిల్లాలో 2000 మందికి పైగా ఈ ఆర్థిక సాయాన్ని అందుకోనున్నారని తెలిపారు. ఫిషింగ్ హార్బర్ ను జూన్ 15 నాటికి పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. మచిలీపట్నం పోర్టు ను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. పాఠశాలలో పున ప్రారంభమయ్యే నాటికి తల్లికి వందనం అమలు చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమాన ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఈ వేసవి కాలం సమయంలోనే ఇరిగేషన్ పనులన్నీ పూర్తి చేయాలని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు.
ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు రోడ్ల ఇరువైపులా పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు పలు రకాల పరిశ్రమలు రానున్నాయని, అవి నెలకొల్పుటకు అధికారులు తమ వంతు సహకారం అందించాలన్నారు. బుడమేరు నది మరోసారి పొంగి ప్రమాదం సంభవించకుండా గట్లను పటిష్ట పరచే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. రక్షిత మంచినీటి పథకాల ఫిల్టర్ బెడ్లను శుభ్రం చేసి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సూచించారు. ధాన్యం సేకరించే సమయంలో ఇబ్బందులు ఉన్నాయని పరిష్కార మార్గంగా ప్రతి మిల్లులో డ్రైయర్ ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు
తీసుకోవాలని కోరారు. యంత్ర సేవలో భాగంగా డ్రైయర్ లను రైతులకు సబ్సిడీపై అందించాలని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాంత రైతాంగం లాభదాయకమైన ఆయిల్ ఫామ్ సాగుకు మొగ్గు చూపాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన కోసం వర్క్ షాప్ లు ఏర్పాటు చేయాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. ఇకపై జిల్లాలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, సి పి ఓ గణేష్ కృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News