Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 వేల వ్యవసాయ కనెక్షన్లు

-భవిష్యత్తులో మరో 50 వేలు అందించేందుకు ప్రణాళికలు
-అద్దంకిలో రెండు సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి గొట్టిపాటి
-12 ఏళ్ల తరువాత అద్దంకిలో శాశ్వత అగ్నిమాపక కేంద్రానికి శంకుస్థాపన

అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 70 వేలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. భవిష్యత్తులో మరో 50 వేల వ్యవసాయ కనెక్షన్లు అందించేందుకు ఇంధన శాఖ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు. అద్దంకి నియోజకవర్గంలో బుధవారం నాడు మంత్రి గొట్టిపాటి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలో మరో రెండు సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుమారు రూ.11 కోట్ల తో నిర్మించనున్న ఈ రెండు సబ్ స్టేషన్లకు భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజా వినియోగానికి తగినట్లు నాణ్యమైన విద్యుత్ ను అందించే దిశగా రెండు సబ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా ఇప్పటి వరకు అద్దంకిలో 1700 కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలను మార్చినట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు. రానున్న రోజుల్లో మరో 500 కొత్త విద్యుత్ స్తంభాలను అందుబాటులోకి తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ సంస్కరణలను అమలు చేయలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని అన్నారు. అనాలోచిత నిర్ణయాలతో జగన్ రెడ్డి ప్రతీ వ్యవస్థను భ్రష్టుపట్టించినట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో, ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని నిర్మించేందుకు భూములు ఇచ్చిన రైతులను కూడా జగన్ ఇబ్బంది పెట్టినట్లు పేర్కొన్నారు. అమరావతి పూర్తి అయితే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుర్మార్గపు ఆలోచనతో మూడు రాజధానుల పేరుతో జగన్ నాటకం ఆడినట్లు స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా.. తరువాత వచ్చే ప్రభుత్వాలు వాటిని కొనసాగించాలని అన్నారు. నాడు సీనియర్ ఎన్టీఆర్ ప్రారంభించిన రూ.2 లకే కిలో బియ్యం ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ అలానే కొనసాగుతుందని చెప్పారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరాన్ని కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో నాశనం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డని ఆయన విమర్శించారు.

శాశ్వత అగ్నిమాపక కేంద్రానికి శంకుస్థాపన:
అద్దంకిలో శాశ్వత అగ్నిమాపక కేంద్రానికి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు శాశ్వత అగ్నిమాపక భవనం లేక స్థానికంగా ఉండే వ్యవసాయ మార్కెట్ యార్డులో అగ్నిమాపక సిబ్బంది తమ కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. దీనిని గమనించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్… శాశ్వత భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులతో స్థానికంగా శింగరకొండ వద్ద అగ్నిమాపక భవనం కు బుధవారం నాడు శంకుస్థాపన చేశారు.

ప్రధాని మోడీ సభ విజయవంతం చేయండి
అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… మే 2 తేదీన జరగనున్న అమరావతి పునర్నిర్మాణ సమావేశానికి అద్దంకి నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రజల కోసం రవాణా, భోజన ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతుందని మంత్రి తెలిపారు. వేసవి కాలం కాబట్టి సభకు వచ్చే వారికి మంచినీరు ప్యాకెట్లను అందించడంతో పాటు మజ్జిగ ప్యాకెట్లను కూడా అందించేలా స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *