-పింఛన్ల పంపిణీ పరిశీలించి, పలువురుకు పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం మంచి లక్ష్యంతో అందిస్తున్న ఎన్.టి.ఆర్. భరోసా పించన్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం చిత్తూరు నగరంలోని డివిజన్లలోని భరత్ నగర్ మూడో గేటు వద్ద ఎన్.టి.ఆర్. భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించి నేరుగా పలువురు లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. పించను దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడం పట్ల లబ్దిదారులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్ధులకు ప్రభుత్వం పింఛన్లను పెద్ద మొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్దిదారులకు వివరించారు. ఆగస్టు మాసపు ఎన్.టి.ఆర్. భరోసా పించన్లు అందించే క్రమంలో జిల్లాలో ఉన్న 2,69,025 మంది పింఛను దారులకు ప్రభుత్వం రూ. 94.12 కోట్లు విడుదల చేసిందన్నారు. శుక్రవారం సాయంత్రం నాటికి 2,54,201 మందికి 88.85 కోట్ల పింఛనును లబ్ధిదారులకు 94 శాతం పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆగస్టు 1వ తేదీన పింఛన్లు ఏదైనా కారణం చేత తీసుకోని వారికి ఆగస్టు 2వ తేదీ శనివారం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా జిల్లాలో ఆగస్టు నెల నుంచి కొత్తగా 4,090 మందికి నూతనంగా పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, వాటిని కూడా ఈ నెలలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారి తో పాటు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News