విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు, కళాకారులకు మధ్య అవగాహన పెంచి, సంస్కృతి సంప్రదాయ బద్ధమైన కళాకృతులను భావితరాలకు అందించాలన్నదే చిత్రకళా సంత ముఖ్య ఉద్దేశమని కామ్రేడ్ జి ఆర్ కె పోలవరపు సాంస్కృతిక సమితి సెక్రటరీ గోళ్ళ నారాయణ వెల్లడించారు. చిత్రకళా సంతలు, కళా వేదికలు చిత్రకారులకు ఎంతగానో ప్రోత్సాహాన్నిస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చిత్ర కళా సంత ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కామ్రేడ్ జి ఆర్ కె పోలవరపు సాంస్కృతిక సమితి సెక్రటరీ గొళ్ళ నారాయణ, ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్ ఎం పీరాన్, ప్రధాన కార్యదర్శి కే బాలయోగి తదితరులు పాల్గొని మాట్లాడుతూ విజయవాడ ప్రెస్ క్లబ్లో పుట్టిన ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య అంచలంచెలుగా ఎదిగి ఎన్నో చిత్రకళా ప్రదర్శనలు, ఆర్ట్ క్యాంపులు నిర్వహిస్తుందన్నారు. 2015లో కళాదర్శిని వేదికగా ఏపీ చిత్రకళా సంత పేరుతో జాతీయ మెగా ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు అన్నారు. ఇంతవరకు మూడు చిత్రకళా ప్రదర్శనలు చేయగా, ఈ సంవత్సరం డిసెంబర్ 14న దూరదర్శన్ టిటిడి కళ్యాణమండపం రోడ్డు లో నాలుగవ చిత్రకళా సంత నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అనేకమంది చిత్రకారులు పెయింటింగ్స్ ప్రదర్శన చేస్తారన్నారు. ఈ సంతల ద్వారా తక్కువ ధరలకే పెయింటింగ్స్ కొనుక్కునే అవకాశం ఉంటుందన్నారు. కళా పోషకులు, కళాభిమానులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News