Breaking News

మోదీ పాలనలో పెట్రేగుతున్న మతోన్మాదం

-రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం
-వ్యవస్థాగత ఓటు దొంగతనం
-మహిళా రక్షణ కేవలం నినాదమే
-కార్పొరేట్లకు ప్రభుత్వ ఆస్తుల ధారాదత్తం
-ప్రజాద్రోహ పాలనపై సమరశీల ఉద్యమాలు
-NFIW జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సైదా హమీద్ , నిషా సిద్దూ
-NFIW జాతీయ సమితి సమావేశాలు ప్రారంభం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోని మోదీ నాయకత్వంలోని బీజేపీ కూటమి పాలన అవలంభిస్తున్న మతోన్మాద, రాజ్యాంగ విరుద్ధ, ప్రజాద్రోహక పాలనకు వ్యతిరేకంగా మరిన్ని సమరశీల ఉద్యమాలు ఆవశ్యమని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (NFIW) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సైదా సయుద్దీన్ హమీదా ,నిషా సిద్దూ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. దేశంలో మతవాద రాజకీయాలు ప్రధానంగా ఆయుధంగా మారిందని, దేశ యువత ఈ రాజకీయ వ్యవస్థ వల్ల అత్యంతగా ప్రభావితమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై హింస భయంకర స్థాయికి చేరుకుందని, అత్యాచారాలు, గృహహింస, గౌరవ హత్యలు, సైబర్ వేధింపులు పెరుగుతున్నప్పటికీ, నేరస్తులు శిక్షకు బదులుగా రాజకీయ రక్షణ పొందుతున్నారని ధ్వజమెత్తారు. దేశ రాజకీయాలు ఇక ప్రజావిరోధ విధానాలకే పరిమితం అవుతూ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ, పౌరుల హక్కులను వ్యవస్థాగతంగా బలహీనపరిచే దశలోకి ప్రవేశించాయని అన్నారు. ఈ పరిస్థితి యాదృచ్ఛిక వైఫల్యాల ఫలితం గానీ, పరిపాలనా అజ్ఞానత ఫలితంగానీ కాదన్నారు. ఇది పాలక వర్గం, కార్పొరేట్ మూలధనం శక్తుల మధ్య లోతైన, ఉద్దేశపూర్వక కూటమి ఫలితమని నొక్కిచెప్పారు.
విజయవాడ గాంధీనగర్ ఐఎంఏ హాలులో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జాతీయ కౌన్సిల్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న సమావేశాలకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఏంఏ ఆవరణలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పతాకాన్ని నిషా సిద్ధూ, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అత్తిలి విమల, పెన్మెత్స దుర్గాభవాని, వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి జాతీయ అధ్యక్షురాలు సైదా సయుద్దీన్ హమీదా ఎగురవేశారు. అనంతరం కార్యదర్శి నివేదికను నిషా సిషాసిద్దూ ప్రవేశ పెట్టారు. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘంగా వారు ప్రసంగించారు.
నిషా సిషాసిద్దూ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రధాన లక్ష్యం ప్రజలను శాశ్వతంగా భయం, ఉన్మాదం, కృత్రిమ గందరగోళంలో బంధించి ఉంచి, తద్వారా వాస్తవ సామాజిక ఆర్థిక ప్రశ్నల చుట్టూ ఏ విధమైన సంఘటిత ప్రతిఘటన కూడా ఎదగకుండా చేయడమేనని చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా ఏదొక జాతీయ సమస్యను సృష్టిస్తున్నారని, కొన్నిసార్లు నోట్ల రద్దు వంటి నిర్ణయాలు అసంఘటిత కార్మికులు, పేదల జీవనోపాధులపై నేరుగా దాడి చేయడానికి ఉపయోగించబడ్డాయని గుర్తుచేశారు. మరికొన్ని సార్లు ఎనఆర్‌సీ, సీఏఏ, కేవైసీ వంటివి అకస్మాత్తుగా అమలు చేసేందుకు ఒడిగడుతున్నాయని తప్పుపట్టారు. యుద్ధోన్మాదం, సరిహద్దు ఉద్రిక్తతలను తరచూ రెచ్చగొడుతుండగా, మతద్వేషాన్ని రాజకీయ ఆయుధంగా వినియోగిస్తున్నారన్నారు. ఇది పరిపాలనా గందరగోళం కాదనీ, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ, కార్మిక హక్కులు, మహిళల భద్రత, సామాజిక న్యాయం వంటి అంశాలను అంచులకు నెట్టివేయడానికి రూపొందించిన జాగ్రత్తైన దారి మళ్లింపు వ్యూహమని ఆమె విశ్లేషించారు.
ప్రజాస్వామ్యంపై దాడి కేవలం విధాన నిర్ణయాలకే పరిమితం కాదనీ, ప్రజాస్వామ్యానికి పునాదైన ఎన్నికల ప్రక్రియనే వ్యవస్థాగతంగా బలహీనపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) వంటి ప్రక్రియల ద్వారా పేదలు, వలస కార్మికులు, దళితులు, మైనార్టీలు, పెద్ద సంఖ్యలో మహిళల పేర్లు ఓటరు జాబితాల నుంచి తొలగించబడుతున్నాయని, డాక్యుమెంటేషన్ పేరుతో పౌరసత్వం, ఓటు హక్కును షరతులతో కూడిన, బహిష్కరణాత్మక అంశాలుగా మారుస్తున్నారని ఆందోళన చెందారు. ఇది ఎన్నికల సంస్కరణ కాదన్నారు. వ్యవస్థాగత ఓటు దొంగతనం, ఎన్నికల ఇంజినీరింగ్. ఎన్నికలు ఇక ప్రజల సార్వభౌమ సంకల్పాన్ని వ్యక్తపరిచే సాధనంగా కాక, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఫలితాలను తయారుచేసే పద్ధతిగా మారుతున్నాయని చెప్పారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి రాజ్యాంగ సంస్థలను బహిరంగంగానే దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు. ఇవి న్యాయ సాధనాలుగా కాక, ప్రతిపక్ష నేతలు, ప్రజా ఉద్యమాలు, కార్మిక సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంస్థలను భయపెట్టడానికి, మౌనం పాటింపజేయడానికి ఉపయోగించే ఆయుధాలుగా మారాయని అన్నారు. ఎన్నికల సమయాల్లో దాడులు, అరెస్టులు, విచారణలు సాధారణ రాజకీయ వ్యూహంగా మారగా, అధికారియోంతో సంబంధం ఉన్న కార్పొరేట్ నేరాలపై కావాలని మౌనం పాటిస్తున్నారన్నారు. ఈ విధ్వంసకర రాజకీయ విధానాలకు కేవలం ఆర్థిక పునాది నయా-ఉదారవాద విధానాలేనని, వాటి అత్యంత క్రూర రూపం నాలుగు కొత్త కార్మిక కోడ్లలో కనిపిస్తోందని విశ్లేషించారు. ఈ చట్టాల ద్వారా దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించిన కార్మిక హక్కులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేయబడ్డాయన్నారు.
శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్, అనిశ్చిత ఉద్యోగాలు వస్తున్నాయని, పని గంటలు పెంచుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సంఘటితమయ్యే హక్కు, సమ్మె హక్కు తీవ్రంగా పరిమితమయ్యాయని, కార్మిక తనిఖీ వ్యవస్థలు నిర్వీర్యం చేయబడ్డాయని వివరించారు. ఇది కార్మిక సంస్కరణ కాదు, కార్మికులను చౌకగా, అసురక్షితంగా, కార్పొరేట్ లాభాలకు పూర్తిగా లోబడి ఉండేలా చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నమని తెలిపారు. ఈ కార్మిక కోడ్ల ప్రభావం మహిళా కార్మికులపై మరింత వినాశకరంగా ఉందన్నారు. మహిళలకు ఉన్న స్వల్ప రక్షణలు కూడా వ్యవస్థాగతంగా తొలగించబడుతున్నాయని, కాంట్రాక్ట్, అనధికార ఉపాధి విస్తరణ మహిళల ఉద్యోగ భద్రతను నాశనం చేసిందని, సమాన వేతనం ఖాళీ హామీగా మిగిలిందని చెప్పారు. పనిస్థలంలో దోపిడీ, వేధింపులకు ఎదురు నిలబడే అవకాశం వేగంగా క్షీణిస్తోందని, అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మహిళలు సామాజిక భద్రత, గౌరవప్రద వేతనాల నుంచి ఇంకా బహిష్కృతులేనని పేర్కొన్నారు.
సమానత్వం పేరుతో మహిళలను రాత్రి షిఫ్ట్‌లలో, ప్రమాదకర వృత్తుల్లో భద్రతా ఏర్పాట్లు లేకుండా పనిచేయమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త కార్మిక విధానం మహిళల శ్రమను చౌకగా, వినియోగించదగినదిగా, కనబడనిదిగా చూడే లోతైన పితృస్వామ్య కార్పొరేట్ తర్కాన్ని సంస్థాగతం చేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా కష్టజీవులు, పేదలకు ఎంతో ఉపాధినిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ)పేరు మార్చుతూ దాని స్థానంలో…..వీబీ జీఆర్ఎంజీ బిల్లు ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నయా-ఉదారవాద దాడి ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణతో కలిసే ముందుకెళుతోందన్నారు. రైల్వేలు, బీఎసఎనఎల్, దేశ భూములు, గనులు, పోర్టులు, విమానాశ్రయాలు వేలం వేయబడుతున్నాయని చెప్పారు. దీన్ని అభివృద్ధిగా చూపుతున్నప్పటికీ, వాస్తవంలో ఇది కొద్ది కార్పొరేట్ సంస్థలకు అపార లాభాలు, పని చేసే ప్రజలకు మరింత అసురక్షిత భవిష్యత్తును హామీ ఇస్తోందని, మహిళలు, కార్మికులు, రైతులు ఈ మోడల్‌కు అత్యధిక మూల్యం చెల్లిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతోపాటు పీపీపీ విధానంతో ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యల్ని ఆమె తూర్పారబట్టారు. మహిళల భద్రత ఖాళీ నినాదాలు, ప్రసంగాలకే పరిమితమైందని, నేరస్తులు రాజకీయంగా ఉపయోగకరులైతే, చట్టాన్ని కావాలని స్తంభింపజేస్తున్నారని, ఇది కేవలం చట్టసౌకర్యాల వైఫల్యం కాదు, పితృస్వామ్యం, పాలక రాజకీయ శక్తి మధ్య బలమైన కూటమి ప్రతిబింబమని తెలిపారు. ఆర్‌టీఐపైన, మీడియాపైన కార్పొరేట్ ఆధిపత్యం, రాజ్యాంగ సంస్థల లొంగుబాటు కలిసి ప్రజాస్వామ్యాన్ని లోపల నుంచే ఖాళీ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాజకీయాలు ఇక అసమర్థమైనవే కాక, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, కార్మిక హక్కులు, మహిళల విముక్తికి ప్రాణాంతకంగా మారాయన్నారు.
ప్రజా ఆరోగ్య వ్యవస్థలను బలపరచడం, మహిళలపై గృహహింస పెరుగుదలను ఎదుర్కోవడం, పని చేసే మహిళలకు భద్రత కల్పించడం బదులు, మూఢనమ్మకాలు, ప్రతీకాత్మక చర్యల్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. విజ్ఞానం, సామాజిక విధానాలను పక్కనపెట్టి, ప్రదర్శన, ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు.
ఈ సందర్భంలో ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఉమెన్ పాత్ర అత్యంత కీలకంగా నిలవనుందనినొక్కిచెప్పారు. మహిళల హక్కులు, కార్మిక హక్కులు, ప్రజాస్వామ్య ప్రక్రియలను కాపాడాలంటే, ఈ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఐక్యమైన, సిద్ధాంతపరమైన, పోరాటాత్మక జోక్యం అవసరమని ఆమె దిశానిర్దేశం చేశారు. ఓటు హక్కు దొంగతనం, ఎస్ఐఆర్ ప్రక్రియలు, మతమార్పిడి వ్యతిరేక చట్టాలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, నాలుగు కార్మిక కోడ్లు, నయా-ఉదారవాద విధానాలపై సామూహిక స్వరం లేపుతూ, మహిళలు, కార్మికులు, రైతులు, యువత సంయుక్త పోరాటాలను బలోపేతం చేయడం కాలం కోరుతున్న అత్యవసరమని ఆమె పునరుద్ఘాటించారు. ఈ రోజు దేశానికి భయం లేదా ద్వేషం అవసరం లేదు. స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలు, కార్మిక హక్కులు, మహిళల విముక్తి, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య బాధ్యత అవసరమని నొక్కిచెప్పారు. ఓట్లు దోచే, కార్మిక హక్కులను లాక్కొనే, సంస్థలను భయపెట్టే… ప్రజలను చీల్చి పాలించే ఏ పాలననూ ప్రజాస్వామ్యమని పిలవలేం అది ప్రమాదకరం. ప్రస్తుత రాజకీయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రతిఘటనను మరింత తీవ్రతరం చేయాలనే తన సంకల్పాన్ని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పునరుద్ఘాటిస్తోందన్నారు.

ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ అధ్యక్షులు సైదా సయుద్దీన్ హమీదా మాట్లాడుతూ అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా పాలస్తీనాలో జరుగుతున్న మారణకాండ, చిన్న పిల్లల తల్లులు చనిపోవడం, యుద్ధ కామంధులు జరుపుతున్న యుద్ధాలతో ముఖ్యంగా మహిళలు, పిల్లలు ప్రాణాలు పోతున్నాయని, వారికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఒక దళం.. ఇంకో దళాన్ని దోచుకోవడంకోసమే నియంతలుగా మారుతున్నారని చెప్పారు. బంగ్లాదేశ్, నేపాల్?లలో దారుణాల కాండ, ఇటీవల వెనెజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడి ప్రపంచ భద్రతకే ముప్పువాటిల్లేలా ఉన్నాయని అన్నారు. వెనెజువేలా దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఎక్కడైనా విద్వేషపూరిత రాజకీయాలు, మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, ప్రజల మధ్య విద్వేషాలను పెంచడం మానవత్వం కాదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చూడాలని తెలిపారు. ప్రస్తుతం దీనికి ఉదాహరణంగా బంగ్లాదేశ్, నేపాల్, పాలస్తీనాలో నిలుస్తాయని వివరించారు.
తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రానాయక్, నజీర్ తదితరులు అభ్యుదయ గేయాలను ఆలపించారు.
తొలి రోజు జాతీయ సమితి సమావేశానికి అధ్యక్షవర్గంగా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు డాక్టర్ కొన్నికా రాయ్, డాక్టర్ కె.రజని, శ్యామ్‌శ్రీ భాస్, పెనుమత్స దుర్గాభవాని, కన్వల్‌సిట్ కౌర్, శక్తిదేవి, పద్మావతి వ్యవహరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు జాతీయ, ప్రాంతీయ సమావేశాలపై చర్చించారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ కార్యదర్శులు అరుణా సిన్హా, డాక్టర్ బిసు మోల్, డాక్టర్ ఏఆర్ శాంతి, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అత్తిలి విమల, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.పద్మావతి, కార్యదర్శులు ఎం.యామిని, నదియా, రాష్ట్ర సమితి సభ్యులు ఓర్సు భారతి, సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరై.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకురానున్న గోవా షిప్‌యార్డ్

-రూ.8 వేల కోట్ల పెట్టుబడితో 400 ఎకరాల్లో భారీ నౌకా నిర్మాణ పరిశ్రమ -సుమారు 10 వేల మందికి ప్రత్యక్ష …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *