Breaking News

ప్రజాస్వామ్య పటిష్టతకు ఓటు హక్కు వినియోగమే బలమైన పునాది

– ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత
– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ తెలిపారు.

స్థానిక తుమ్మల పల్లి కళాక్షేత్రం లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ హాజరై మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. భారత ఎన్నికల సంఘం 1950, జనవరి 25న స్థాపించబడిన ప్రకారం ఈ రోజున నిర్వహిస్తామన్నారు. ఓటింగ్ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, ముఖ్యంగా యువ ఓటర్లను ప్రోత్సహించడం మరియు వారి హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ ఏడాది “నా భారత్ – నా ఓటు” (My India, My Vote) థీమ్ తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాదు…ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రతి ఓటు ప్రజాస్వామ్య భారత నిర్మాణానికి బలమైన పునాది వేస్తుందన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, దీని బలం పౌరుల భాగస్వామ్యంలోనే ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేసి, వారికి ఓటరు గుర్తింపు కార్డులు (EPIC) అందించేందుకు ఎన్నికల సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా యువత ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకొని, ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ పిలుపునిచ్చారు.

చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 1950 లో స్థాపించబడిన సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. గతంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి కేవలం జనవరి 1వ తేదీని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం, 18 ఏళ్లు నిండిన వారు సంవత్సరంలో నాలుగు తేదీలలో (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. కొత్త ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా లేదా సంబంధిత బి.ఎల్.ఓ (BLO) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫారం-8 (Form-8) ద్వారా తమ చిరునామాను మార్చుకోవచ్చన్నారు. కేవలం ఎపిక్ (EPIC) కార్డ్ ఉండటం వల్ల ఓటు వేసే హక్కు రాదని,. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో సీఈఓ (CEO) వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలన్నారు. యువతను ప్రోత్సహించడానికి ఎన్నికల సంఘం పాఠశాలలు, కళాశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌లు, పోలింగ్ స్టేషన్లు, పాఠశాలలు వద్ద ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ తెలిపారు.

మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఓటు వేయడం అనేది ఆర్టికల్ 19 ప్రకారం లభించే భావ ప్రకటన, వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ‘మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్’ (ఎన్నికల నియమావళి) ని ఎటువంటి రాజీ లేకుండా పారదర్శకంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. పౌరుల్లో ఎటువంటి భయం లేదా నిర్బంధం లేకుండా ఓటు వేసేలా కలెక్టర్లు పటిష్టమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. ఒక వ్యక్తి సాధారణంగా ఎక్కడ నివసిస్తుంటే అక్కడ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఒక వ్యక్తి పుట్టిన చోటు, ఉద్యోగం చేసే చోటు వేర్వేరుగా ఉండవచ్చు, కాబట్టి ఓటు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను ఓటరుకు ఇవ్వాలన్నారు.

తొలుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వర్చువల్ గా తన సందేశాన్ని అందిస్తూ.. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ మన దేశంలో గౌరవనీయ ఓటర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ఎన్నికల కమిషనర్ 1950, జనవరి 25న, అంటే గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు స్థాపించబడిందన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని మన గొప్ప ప్రజాస్వామ్య ఓటర్ల కోసం అంకితం చేస్తూ ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’గా జరుపుకుంటామన్నారు. 2025 సంవత్సరం ఎన్నికల కమిషన్‌కు గణనీయమైన విజయాలు, ఆవిష్కరణల సంవత్సరంగా నిలిచిందన్నారు. ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వాన్ని, సమగ్రతను పెంపొందించడం, ఓటింగ్ ప్రక్రియను ప్రతి ఓటరుకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, ఎన్నికల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, దృఢంగా, నమ్మదగినదిగా మార్చడం వంటి చర్యలు తీసుకున్నామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలియజేశారు.

ఓటరుగా నూతనంగా నమోదు చేసుకున్న 4 ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేసిన అనంతరం ఓటు హక్కు ప్రాముఖ్యతపై మతం, కులం, జాతి లేదా భాషా పరమైన ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించారు. తదనంతరం బెస్ట్ ఎలక్షన్ జిల్లా అవార్డు-2025 కు గత ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వారికి ఉత్తమ అవార్డులు, ఉత్తమ ఎన్నికల నిర్వహణ, ఎన్ రోల్ మెంట్ పెంచడంలో కృషి చేసిన జిల్లా కలెక్టర్లకు అవార్డులను అందించారు.

కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎలక్టోరల్ అధికారి డా. జి. లక్ష్మీశ, ఎన్నికల విభాగం అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *