-సంక్షేమంలో రికార్డులు సృష్టిస్తూ సాగిన రెండేళ్ల కూటమి పాలన
-ఆర్థిక కష్టాలున్నా పండుగలా సంక్షేమం అమలు
-గతానికంటే డబుల్, త్రిబుల్ సంక్షేమం అందిస్తోన్న ఎన్డీఏ
-రెండేళ్ల పాలనపై సంక్షేమం థీమ్‌తో తిరుపతిలో బహిరంగ సభ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. అనేక కష్టాలతో… విధ్వంసమైన వ్యవస్థల నడుమ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జీతాలే సరిగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాలన్నా వీలు లేని విధంగా అప్పటి వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయి. పైసా ఖర్చు పెట్టాలన్నా… అనేక రకాలుగా ఆలోచించే పరిస్థితి నాడు ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గట్టెక్కించారు. సంపద పెంచారు.. ఆ మేరకు సంక్షేమం అందించారు. ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమం రికార్డులు సృష్టిస్తోంది. సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా చేయాలనే అంశంపై వివిధ రాష్ట్రాలు ఏపీ వైపే చూస్తున్నాయి. రెండేళ్ల కాలంలో ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇస్తున్న సామాజిక భద్రతా పెన్షన్ల మొత్తం అక్షరాలా రూ. 65,887 కోట్లు. అంటే ఏడాదికి సుమారు రూ.33 వేల కోట్లను పేదల సేవలో పేరుతో పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో సహా.. దేశంలోని మరే ఇతర రాష్ట్రం కూడా ఈ విషయంలో ఏపీకి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతోంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో రూ.200, రూ. 500 మాత్రమే సామాజిక భద్రత పెన్షన్లను ఇస్తున్నారు. మన పొరుగునున్న రాష్ట్రాల్లో ఏపీ ఇస్తున్న దానిలో సగమే. ఈ సమయంలో దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఏపీ ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్లను రూ.4 వేలు చేసింది. ఈ పథకం అమలు ఓ రికార్డ్ అనే చెప్పాలి. అలాగే పేదవాడికి మూడు పూటలా తిండి పెట్టే అన్న క్యాంటీన్ల ఏర్పాటు దగ్గర నుంచి పేద, మధ్య తరగతి ప్రజలు గౌరవంగా జీవనం సాగించేందుకు అవసరమైన ప్రతీ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటోంది.
అందరికీ వర్తించే సంక్షేమ పథకాల అమలు ఘనత కూటమిదే
రెండేళ్ల పాలనలో తొలి రోజు నుంచి సంక్షేమానికే ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద పీట వేశారు. ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు చేశారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా ఆడిన మాట తప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించింది ఎన్డీఏ ప్రభుత్వం. సంక్షేమ పథకాలంటే.. ఏదోక వర్గానికి చెందిన వారిని లబ్దిదారులుగా ఎంపిక చేసుకుని లక్ష్యం చేసుకుని అందించడమనేది ప్రభుత్వాలకు అలవాటు. కానీ దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అందరికీ సంక్షేమాన్ని, ప్రభుత్వ సబ్సిడీలను అందించేలా ఓ రెండు పథకాలను అమలు చేసింది. వీటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది అన్న క్యాంటీన్ల గురించి. అన్న క్యాంటీన్లల్లో ఫలానా వర్గం వాళ్లకే భోజనం అందిస్తారనే రూల్ ఏమీ లేదు. అలాగే పేదవారికే అనే ఆంక్షలు లేవు. అన్న క్యాంటీన్లకు ఎవరైనా రావచ్చు… ఎవరైనా తినొచ్చు.. ఇదీ విధానం. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లల్లో చక్కగా భోజనం చేయవచ్చు. ఈ పథకం ద్వారా పేదలు, ఆటోడ్రైవర్లు, రోజు కూలీలు ఇలాంటి వారు ఎక్కువగా లబ్ది పొందుతున్నారు. నెలకు రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు వారి సంపాదనలో ఆదా చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 269 క్యాంటీన్లు ఉంటే వాటి కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.230 కోట్లను వెచ్చించింది. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది. ఈ స్త్రీ శక్తి పథకాన్ని కూడా పేద, మధ్య తరగతి నిబంధనలేవీ లేకుండా… ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఉద్యోగాలకు వెళ్లే స్త్రీలకు.. స్వయం ఉపాధి పొందుదామనే మహిళా రైతులకు, తమ ఉత్పత్తులను మార్కెట్టుకు తీసుకెళ్లే డ్వాక్రా మహిళలకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే యువతులకు ఈ పథకం చక్కగా ఉపయోగపడుతోంది. అలాగే వివిధ పుణ్యక్షేత్రాలకు, టూరిస్ట్ స్పాట్లకు, బంధువుల ఇళ్లకు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అంతే కాకుండా.. గతంలో బస్ పాస్ తీసుకోవడానికి క్యూలైన్లల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. స్త్రీ శక్తి పథకం అమలుతో ఆ శ్రమ కూడా తప్పింది. ఈ పథకం కోసం ఇప్పటి వరకు రూ.2,565 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించింది.
రికార్డు సృష్టించిన తల్లికి వందనం…
రాష్ట్రంలో స్కూల్ కు వెళ్తోన్న ప్రతి పిల్లవానికి రూ.15 వేలను వారి తల్లుల ఖాతాలో వేయడమనేది దాదాపు అసాధ్యమని నాడు అధికారులు చెప్పారు. మరికొంత సమయం తీసుకుని తల్లికి వందనం అమలు చేద్దామని ఆర్థిక శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కు సూచించారు. కానీ మహిళలకు ఇచ్చిన హామీని తప్పడానికి వీల్లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులను సమకూర్చుకుని తల్లికి వందనం అమలు చేసి తీరాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో సుమారు 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తూ సుమారు 47 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,090 కోట్లను జమ చేశారు. ఒక సంక్షేమ పథకానికి సంబంధించి ఒకేసారి ఇంత మొత్తం కేటాయించడం ఇదే తొలిసారి… ఇది ఓ రికార్డు. ఇక్కడ మరో ముఖ్య అంశం ఏమిటంటే… తల్లికి వందనం పథకం కిందే.. సుమారు రూ.75 వేలు.. అంతకు మించి కూడా డబ్బులు తీసుకున్న కుటుంబాలు ఉన్నాయి. మళ్లీ స్కూళ్ల రీ-ఓపెన్ చేసిన తర్వాత మరోసారి తల్లికి వందనం నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీపం-2.0 పథకం ఇప్పటి వరకు 4.26 కోట్ల సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించింది. దీని నిమిత్తం రూ. 3,100 కోట్లను కూటమి ప్రభుత్వం భరిస్తోంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మందికి రైతులకు ఇప్పటి వరకు రూ.8985 కోట్లను జమ చేశారు. దీని ద్వారా సుమారు 46 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 7 వేలు మాత్రమే ఇస్తే… ఇప్పుడు రాష్ట్ర వాటా కింద రూ.14 వేలు చెల్లిస్తూ… కేంద్ర వాటాతో కలిపి ప్రతి రైతుకూ రూ.20 వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో వంటి పథకాలను చాలా అందించారు. అందుకే కూటమి ప్రభుత్వానికి సంక్షేమ ప్రభుత్వం అనే బ్రాండ్ వచ్చింది.
మరికొన్ని సంక్షేమ పథకాల అమలు ఇలా…
ఈ సంక్షేమ పథకాలే కాకుండా.. సబ్సిడీల రూపంలో ఇంకొన్ని పథకాలను రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తోంది. మొత్తంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కోసం రెండేళ్లలో కూటమి ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి ఉంటుందనేది అంచనా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..:
• తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం
• స్త్రీ శక్తి : మహిళలకు ఉచితంగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రయాణం – 71 కోట్ల ప్రయాణాలు
• దివ్యాంగ శక్తి : దివ్యాంగులకు ఉచితంగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రయాణం – 32 లక్షల ప్రయాణాలు
• దీపం 2 పథకం : ఏటా ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ – ఇప్పటికి 4.26 కోట్ల సిలిండర్లు.
• అన్న క్యాంటీన్ : రాష్ట్రంలో 269 ఏర్పాటు – 9.71 కోట్ల భోజనాలు
• అన్నదాత సుఖీభవ : 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిపి రూ.8,985 కోట్లు జమ
• ఎన్టీఆర్ భరోసా : ఇప్పటివరకు సామాజిక భద్రతా పెన్షన్ల కోసం రూ.65 వేల కోట్లకు పైగా వ్యయం
• మత్స్యకార సేవలో : ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు
• ఆటో డ్రైవర్ల సేవలో : ఏడాదికి రూ.15,000… రూ.435 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది
• అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు
• P4 ద్వారా పేదరిక నిర్మూలన – 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శుల చేయూత
• 5.5 లక్షల ఇళ్లు పేదలకు అందజేత… మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంకల్పం
• మత్స్యకారుల కోసం జీ.వో 217 రద్దు – నీటి వనరులపై హక్కు
• గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు
• వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ
• స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
• ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ.3,670 కోట్లు
• 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనానికి రూ.51 కోట్లు
• ఇమామ్‌లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు
• వక్ఫ్ బోర్డు పునరుద్ధరణ – అన్ని వర్గాలకు ప్రాధాన్యం
• పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు
• నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు
• చేనేతలకు ఉచిత విద్యుత్ : నెలకు మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు
• జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం
• 20 లక్షల ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్
• సోలార్ రూఫ్ టాప్‌కు బీసీలకు రూ.20 వేల అదనపు సాయం
• రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో డబ్బులు జమ
• క్రమం తప్పకుండా అన్నదాత సుఖీభవం కింద రైతులకుసాయం- డ్రిప్, యాంత్రీకరణ సబ్సిడీలు
• మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పొగాకు, మామిడి, కోకో, ఉల్లి పంటలకు రూ.1,100 కోట్లు
• గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ
• డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్.
Prajavartha Online Telugu News