Breaking News

2027 నాటికి భూ రికార్డులు క్లీన్

-రికార్డుల పూర్తి ప్రక్షాళనకు 3 ఏళ్ల సమయం
-కరెన్సీ నోట్ల తరహాలో పాస్ పుస్తకాలకు భద్రతా ఫీచర్లు
-రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హత గొడ్డలి పార్టీకి ఎక్కడిది..?
-గొడ్డలి పట్టే చేతులకు నాగలి పట్టే చేతులు ఎలా గుర్తుంటాయి…?
-మేం రాజముద్రతో పట్టాలిస్తున్నాం… వాళ్లు దొంగ పట్టాలు సృష్టిస్తున్నారు
-ప్రజలకు, నిరుద్యోగులకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి
-సిద్ధాంతంలో మీ భూమి- మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త :
2027 నాటికి రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత పాలకులు పశ్చిమ గోదావరి జిల్లా లాంటి పచ్చని ప్రాంతంలోనూ భూ చిచ్చు పెట్టారని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. గజం భూమిని కూడా సద్వినియోగం చేసుకునే రైతులనూ గత ప్రభుత్వం వదిలి పెట్టలేదని తీవ్రస్థాయిలో ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో మీ భూమి- మీ హక్కు పేరిట రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దుర్మార్గమైన గత పాలకుల నిర్వాకంతో రికార్డులన్నీ గందరగోళంగా తయారయ్యాయని ప్రజలకు చెందిన భూముల విషయంలో సమస్యలు సృష్టించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూ రికార్డులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి దుర్మార్గపు చట్టాన్ని రద్దు చేసి యాజమాన్య హక్కుల్ని రక్షించామని వివరించారు. క్యూ ఆర్ కోడ్ సహా కరెన్సీ నోట్ల తరహాలోనే అత్యంత పటిష్టమైన భద్రతా ఫీచర్లతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని తెలిపారు. గత పాలకులు చేసిన అవకతవకల కారణంగా భూమి రికార్డుల ప్రక్షాళనకు 3 ఏళ్ల సమయం పడుతుందని సీఎం అన్నారు. దేశంలోనే తొలిసారి బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతీ యూనిట్ కు శాశ్వతమైన బ్లాక్ చైన్ ఐడీలు ఇస్తున్నామని.. దీని ద్వారా రికార్డులను ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉండదని తెలిపారు. ప్రజల ఆస్తి పత్రాలపై ఫోటోలు ముద్రించుకున్నారని.. పొలం సరిహద్దు రాళ్లపై బొమ్మల కోసం రూ.800 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. ప్రస్తుతం భూముల రీసర్వే ప్రక్రియలో రైతులను కూడా భాగస్వాములను చేస్తున్నామని… ఈకేవైసీ చేశాకే పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి రైతులకు అందిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 6688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి భూమి రికార్డులను అప్డేట్ చేశామని అన్నారు. 26.46 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశామన్నారు. వచ్చే 9 నెలల్లో మరో 10,357 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 67.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. 2027 నాటికి రాష్ట్రంలో ప్రతీ రైతు వద్దా తప్పుల్లేని పాస్ పుస్తకం ఉంటుందని అన్నారు.

రెవెన్యూ శాఖలో సమూల మార్పులు

రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని… రీ-సర్వే 2.0 కింద ఇప్పటికే 1,836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని సీఎం వివరించారు. విక్రయం, బహుమతి, విభజన వంటి 9 లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ తెచ్చామని తెలిపారు. వారసత్వ హక్కుల బదిలీని సులభతరం చేశామని… రూ.10 లక్షల లోపు ఆస్తులకు రూ.100తో బదిలీ చేస్తున్నామని స్పష్టం చేశారు. 1బీ, అడంగల్, డీకేటీ, ఇనాం, సీలింగ్ వంటి పాత రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియ చేపట్టామని అన్నారు. 80 శాతం ఈ-కేవైసీ పూర్తయిన తర్వాతే గ్రామాలను వెబ్‌ ల్యాండ్ 2.0లోకి తీసుకుంటున్నామని అన్నారు. వాట్సాప్ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తు, ట్రాకింగ్ సౌకర్యం కల్పించామన్నారు. రాష్ట్రంలోని 1.37 లక్షల ఎకాల విలేజ్ సర్వీసు ఇనామ్ భూములను 22 ఏ నుంచి తప్పించామని తెలిపారు. తిరుపతి జిల్లాలో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న శెట్టిపల్లి గ్రామ భూములను పరిష్కరించి వారికి అప్పగించామన్నారు. అక్వా రైతులకు అండగా నిలబడ్డామని సీఎం స్పష్టం చేశారు. గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో పాటు, ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరిచారు. ఆక్వా జోన్ పరిధిలోని చెరువులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. అక్వా ఫీఢ్ రేట్లు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రాయితీలు ఇవ్వాలని సోయాబీన్ మీల్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని కేంద్రాన్ని కోరామన్నారు. పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై దృష్టి పెట్టామని సీఎం వివరించారు. ఆక్వా పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్ధాలు కాలుష్య సమస్యగా మారకుండా న్యూట్రాసిటికల్ ఔషధాల తయారు చేసుకునే అవకాశం ఉందన్నారు.

రెండేళ్లుగా సమపాళ్లలో సంక్షేమం- అభివృద్ధి

కూటమి ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని సంక్షేమం- అభివృద్ధి-సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తిరుపతి, అమరావతి, విశాఖలో మూడు ప్రాంతాల్లో మూడు సభలు నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. అభివృద్ధిని ట్రాక్ లో పెట్టామని .. పెట్టుబడులు ఉద్యోగాల కల్పన జరుగుతోందని అన్నారు. సంక్షేమంలో దేశంలో ఎవరూ చేయలేని విధంగా ప్రజలకు మేలు చేస్తున్నాం అని వివరించారు. సూపర్ సిక్స్ లో చెప్పినవాటికంటే అదనంగా ఇచ్చామని తెలిపారు. పెన్షన్, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఆటోడ్రైవర్లు, మత్స్యకారులు ఇలా అందరికీ సంక్షేమం అందిస్తున్నామని వివరించారు.

గొడ్డలి పార్టీది ఓర్వలేనితనం

డీఎస్సీ ద్వారా దాదాపుగా 16 వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని .. పరీక్షలు అంటే తెలీని వ్యక్తులు, రిజర్వేషన్ల గురించి అవగాహన లేని వాళ్లు బురద జల్లే ప్రయత్నం చేస్తు్న్నారని సీఎం ఆరోపించారు. గత పాలకులు జాబ్ క్యాలెండర్ ఇస్తామని దగా చేశారని.. కూటమి ప్రభుత్వం వచ్చాకే ఉద్యోగాలు ఇచ్చి జాబ్ కేలండర్ విడుదల చేశామన్నారు. దీన్ని చూసి ఓర్వలేకే నేరాలు ఘోరాలు చేసి ఎదుటివారిపై దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. గొడ్డలి పార్టీ చరిత్ర రాష్ట్రంలో అందరికీ తెలుసని… నేరాలు చేసి ఎదుటి వాళ్లపై నెట్టేస్తుందని ఆక్షేపించారు. చేసిన ప్రతీ ఆరోపణకూ మంత్రులు అధికారులు పూర్తిగా వివరణ ఇచ్చారని.. దీనికి ఆ వైపు నుంచి సమాధానం లేదని అన్నారు. అసలు రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులను గొడ్డలి పార్టీ నేతలు క్షమాపణలు కోరాలన్నారు. ప్రజల్ని క్షమాపణ కోరకుండా రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు గొడ్డలి పార్టీకి అర్హత లేదన్నారు. ప్రజలకు రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నందుకు తాను సంతోషిస్తున్నానని.. కానీ వైసీపీ పార్టీ నేతలు రాష్ట్రంలో భూ కబ్జాలు చేశారని రికార్డులు తారుమారు చేశారన్నారు. తెలంగాణా రాష్ట్రానికి వెళ్లి అక్కడి ఎమ్మార్వో, జేసీ సంతకాలు ఫోర్జరీ చేసి రికార్డులు తారుమారు చేశారన్నారు. ఈ నేరంలో రూ.1500 కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. ఇంత నేరం జరిగితే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు.. వినుకొండ మాజీ ఎమ్మెల్యేను ఎందుకు సస్పెండ్ చేయలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతులు గుర్తుకు రారని.. కోడి కత్తి డ్రామాలు ఆడేవారికి వరికోతలు ఎలా తెలుస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. గంజాయి బ్యాచ్ లను ఓదార్చేవారికి పంటల సాగు ఎలా తెలుస్తుందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలంటే గొడ్డలి పార్టీ వ్యక్తులను దూరంగా పెట్టాలని సీఎం వ్యాఖ్యానించారు.

అందరి ఆరోగ్యం కోసం యోగాంధ్ర

అనంతరం పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పై జిల్లా నివేదికను ముఖ్యమంత్రి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందించే వివిధ పౌరసేవలను మెరుగ్గా అందించటంలో కృషి చేస్తున్న అధికారులను అభినందించారు. ఆగస్టు 15 లోగానే రాష్ట్రవ్యాప్తంగా సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నట్టు వివరించారు. ప్రీవెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానంలో ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే కూటమి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. జూన్ 21 తేదీన రాష్ట్రంలో కోటి మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 2047 సంపన్నమైన, ఆనందకరమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయటమే లక్ష్యమని వివరించారు. అనంతరం సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్పత్తి అవుతున్న కోకో ద్వారా తయారైన చాక్లెట్లను, కొబ్బరి, పామాయిల్ ఉత్పత్తుల ప్రదర్శనల్ని పరిశీలించారు. వరి ఊక, గడ్డి ద్వారా తయారైన వివిధ ఉత్పత్తులు, గుర్రపు డెక్క ద్వారా తయారైన వర్మీ కంపోస్టును సీఎం పరిశీలించారు. ఆక్వా వ్యర్ధాల ద్వారా తయారైన ఉప ఉత్పత్తులను పరిశీలించి తయారీ దారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *